గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం వేతన సవరణ ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే హెల్త్ స్కీమ్ ను విద్యుత్ కార్మికులకు వర్తింపజేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో విద్యుత్ ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. 50 వేలమందిలో ఆరు వేల మందికి జీపీఎఫ్ సమస్య ఉందనీ, అది కేంద్రం పరిధిలోని అంశమనీ, వివాదంలో ఉన్న సీపీఎస్ ను కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందనీ, గడచిన నాలుగున్నరేళ్లలో అభివృద్ధిలో దూసుకుపోతోందనీ, ఇతర రాష్ట్రాలేవీ తెలంగాణ దరిదాపుల్లో లేవన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి సాధించిన మొట్టమొదటి శాఖ విద్యుత్ శాఖ అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, పథకాలు, పరిశ్రమలు.. ఇలా ఏవి తీసుకున్నా ఈరోజున అభివృద్ధి బాటలో ఉన్నాయంటే దానికి కారణం విద్యుత్ ఉద్యోగుల పనితీరు అని మెచ్చుకున్నారు. రైతులకు కూడా 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రంలో దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అని కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ ప్రసంగం ఇలా ముగుస్తున్న సమయంలో… ఓ కాంట్రాక్టు ఉద్యోగి తమ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కేసీఆర్ స్పందిస్తూ… ‘చంద్రబాబు నాయుడు పెట్టి దుకాణం ఇది. కరెంటు బిల్లు చేసేది ప్రైవేటోళ్లకిచ్చి, అవుట్ సోర్సింగ్ అని పెట్టి… అదే దుకాణం కదా ఇది. ఇది వాళ్లు పెట్టిపోయిన పంచాయితీ. చంద్రబాబు పెట్టిన దుకాణం మీదగ్గరే కాదు.. చాలా చోట్ల ఉంది’ అన్నారు. ఇలాంటివారు శాఖలో దాదాపు వెయ్యి మంది ఉంటారనీ, వారికి సంబంధించిన సమస్యలపై కూడా సానుకూలంగా స్పందిస్తామనీ హామీ ఇచ్చారు. ఈ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య చాలాచోట్ల ఉందనీ, అవుట్ సోర్సింగ్ అని గతంలో పెట్టినవాటిని కొన్ని చోట్ల తీయించామనీ, ఇచ్చే మొత్తాన్ని నేరుగా వారికే చేరేలా చేశామన్నారు. దీంతో ఆయన ప్రసంగం ముగించారు.
ఈ సభలో విద్యుత్ ఉద్యోగులందరికీ వరాలు కురిపించడంతో అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ, ఈ అవుట్ సోర్సింగ్ ఇష్యూ వచ్చేసరికి… దీన్ని చాలా తెలివిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ నెట్టేశారు! ఇదంతా గత ప్రభుత్వం చేసిన తప్పు అన్నట్టు చెప్పారు. చాలా డిపార్టుమెంట్లలో ఇలాంటి సమస్యల్ని పరిష్కరించామని చెప్పిన కేసీఆర్… ఈ విద్యుత్ శాఖకు వచ్చేసరికి ఇది తన తప్పు కాదు, వేరేవరో చేసినది అన్నట్టు మాట్లాడటం గమనార్హం!