తెలుగు సినిమా హీరోలపై ఘాటైన విమర్శలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి నివేదన నిర్వహణ నేపథ్యమై ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామానికో ట్రాక్టర్ చొప్పున ప్రగతి నివేదన సభకు ప్రజలు తరలి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారన్నారు. కానీ, వ్యవసాయ పనులకు వాడే ట్రాక్టర్ పై ప్రయాణానికి పనికి రాదనీ, అది చాలా ప్రమాదకరమనీ, ఇలా ముఖ్యమంత్రే ప్రకటనలు చేయడాన్ని నేరంగా పరిగణించి కేసులు పెట్టాలన్నారు. ప్రజల భద్రత ఈ ప్రభుత్వానికి పట్టదన్నారు. ప్రగతి నివేదన సభ పేరుతో ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు పొడుస్తున్నారన్నారు. ఇష్టం వచ్చినట్టు తవ్వుతున్నారనీ, దీన్ని చూస్తూ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమమో, ప్రభుత్వ కార్యక్రమమో అర్థం కావడం లేదన్నారు.
సభా ప్రాంగణంలో వేలాది చెట్లను నరికేశారనీ, దీనిపై ఎవ్వరూ ఎందుకు స్పందించడం లేదన్నారు. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి హరితహారం అంటూ రాష్ట్రమంతా మొక్కలు నాటించారన్నారు. కానీ, ఇవాళ్ల చెట్లను ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తుండటం పర్యావరణ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు? ‘చెట్లు నాటినప్పుడు ఫొటోలు పెట్టుకున్న సినీ నాయకులారా… మీరు నిజంగానే హీరోలైతే, ఇన్ని వేల చెట్లు నరికి కుప్పేస్తుంటే కళ్లు మూసుకుని ఉంటున్నారా..? మీరు కళ్లులేని కబోదులా? మీ హీరోయిజమంతా… కేసీఆర్ కి కావాల్సినప్పుడు, ఆయన కుటుంబ సభ్యులు ఆదేశించినప్పుడు నటించడానికేనా? పెద్ద బాధ్యత గలోళ్లమని ఫొటోలకు ఫోజులిస్తూ చెప్పుకున్న సినిమా హీరోలు ఏం చేస్తున్నారు..?’ అంటూ రేవంత్ మండిపడ్డారు. సినిమాల పన్నుల మినహాయింపుల కోసమే ప్రభుత్వం ఆదేశించగానే వీరంతా చెట్ల నాటే కార్యక్రమాలకు వెళ్లారని ఎద్దేవా చేశారు.
పచ్చని చెట్లను నరికేస్తుంటే సినిమా హీరోలతోపాటు, నాయకులు కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నారన్నారు. దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా స్పందించాల్సి ఉందని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా వేల చెట్లను నరికిన ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. సినిమా హీరోలందరిపైనా రేవంత్ ఇలా విమర్శించారు. మరి, దీనిపై సినిమా హీరోలు ఎవరైనా స్పందించే పరిస్థితి ఉంటుందా… అంటే, అనుమానమే!