ప్రగతి నివేదన సభ… తెలంగాణలో ఇతర పార్టీలన్నీ అటే చూడాల్సిన పరిస్థితి! ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తారు? తరువాత మనం ఏం చెయ్యాలి.. ఇలా వేచి చూసే పొజిషన్లో ప్రతిపక్షాలు కూర్చున్నాయి. ముందస్తు ఎన్నికలకు తెరాస ఎలా సిద్ధమౌతోందో అని ఎదురుచూసే పరిస్థితిలోనే ప్రతిపక్షాలున్నాయి. అలాగని, ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధపడటం లేదా అంటే… ఎవరికివారు విడివిడిగా సిద్ధం కావాలనే ఆలోచనే చేస్తున్నాయి. అంతేగానీ, అందరి ఉమ్మడి లక్ష్యమైన తెరాస ఓటిమిని సాధించే దిశగా సమష్టి ప్రయత్నం తెలంగాణ ప్రతిపక్షాల మధ్య ఇంకా మొదలు కాలేదు. ఆ అవసరం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రతిపక్షాలను ఏ దశలోగా బలపడకుండా చేయడంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ కేసీఆర్ సక్సెస్ అవుతూనే వచ్చారు. ఇప్పుడు కూడా… సాధారణ ఎన్నికలకు మరి కొన్ని నెలల సమయం ఉన్నా, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు బలపడే అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పుకోవచ్చు! నిజానికి, తెరాసపై కొంత వ్యతిరేక కొన్ని వర్గాల్లో ఉందనే చెప్పాలి. కొన్ని సంఘాలు, అసలైన ఉద్యమకారులకు తెరాస హయాంలో న్యాయం జరగలేదనేవారు, ఉద్యోగాలు ఇబ్బడిముబ్బడిగా వస్తాయని నాలుగున్నరేళ్లుగా ఎదురుచూసి అసంతృప్తికి గురౌతున్న యువత, కొంతమంది రైతాంగం… ఇలా చాలామందే ఉన్నారు. అయితే, ఇవన్నీ ఏకతాటిపైకి వచ్చి, ‘ప్రభుత్వ వ్యతిరేకత’గా రూపుదాల్చేలోగా కేసీఆర్ ఎన్నికల హడావుడి తెచ్చేశారు. వ్యూహాత్మకంగానే ప్రతిపక్షాలకు సమయం లేకుండా చేస్తున్నారు. ఆ ట్రాప్ లో ప్రతిపక్షాలు పడిపోయాయనడంలో సందేహం లేదు.
ఇప్పటికైనా ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదికి వచ్చే అవకాశం ఉందా అంటే… కచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కొంత పట్టువిడుపు ధోరణికి వచ్చి… ఆ పార్టీ పట్టులేని స్థానాల్లో తెరాస తప్ప ఎవరు గెల్చినా ఫర్వాలేదనే నిర్ణయానికి రాగలిగితే, చకచకా రాజకీయ వాతావరణంలో మార్పునకు అవకాశం ఉంది. ఇక, ఈ మధ్య జోరుగా వినిపిస్తున్న చర్చ.. కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేయడం! దీని వల్ల ఈ రెండు పార్టీల్లో దేనికి లాభం నష్టం అనేది వేరే చర్చ. ఒకవేళ ఈ రెండు పార్టీల మధ్య ‘తెరాస ఓటమి అనే కామన్ అజెండా’ కుదిరితే… సీపీఐ కూడా వీళ్లతో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక, జనసేన పార్టీ బహుజన ఫ్రెంట్ తో వెళ్లే ఛాన్స్ ఉంది.
కాంగ్రెస్ పాయింటాఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే.. ఇలాంటి సర్దుబాట్ల ద్వారా ఖమ్మంలోగానీ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న సెటిలర్లు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. తెరాసకు తీవ్రమైన పోటీని ఇవ్వగలుగుతుంది. లేదూ… ఇలా ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లే కంటే విడివిడిగా ఎన్నికలకు వెళ్లడమే కాంగ్రెస్ మనోగతమైతే… తెరాస వ్యతిరేక ఓటు చీల్చినట్టు అవుతుంది. ఇక, ఇతర పార్టీల విషయానికొస్తే… తెలుగుదేశం సొంతంగా ఎన్నికల బరిలో సాధించేమీ ఉండదు. ఇతర పార్టీల పరిస్థితి కూడా కాస్త అటుఇటుగా ఇంతే. కాబట్టి, అందరూ విడివిడిగా ఉండటం వల్ల తెరాసకు లాభం చేకూర్చినట్టవుతుంది. కాబట్టి, కలిసి ముందుకుసాగే ప్రయత్నం ఇప్పుడే మొదలైతే… కేసీఆర్ వ్యూహానికి అనుగుణంగా పరుగులు తీయాల్సిన పని తప్పుతుంది. ఈ ప్రయత్నం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నుంచే మొదలవ్వాలి.