ప్రధానమంత్రి నరేంద్రమోడీ… స్వాతంత్ర్యం రాక ముందు నాటి పరిస్థితులను.. అప్పటి ఘటలను.. తనకు ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకుని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలను.. తేలికగా తీసేస్తూ ఉంటారు. అటు పార్లమెంట్లో కానీ.. ఇటు ఎన్నికల ప్రచారసభల్లో కానీ.. మోడీ చెప్పే ఈ చరిత్ర పాఠాలు కచ్చితంగా ఉంటాయి. అందులో అన్నీ అబద్దాలే ఉన్నాయని.. తర్వాత సోషల్ మీడియాలో గగ్గోలు రేగినా.. ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడా వ్యూహాన్ని… తన ప్రభుత్వ వైఫల్యాల విషయంలోనూ… అమలు చేస్తున్నారు. అంతా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే చేసిందంటున్నారు. నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. నోట్ల రద్దు దగ్గర్నుంచి… బడాబాబులు వేల కోట్ల రుణాలు తీసుకుని పారిపోవడం మాత్రమే కాదు.. ఆదానీ లాంటి..మోడీ సన్నిహిత కార్పొరేట్లు.. తమ ఆస్తుల కన్నా.. నాలుగైదు రెట్లు రుణాలు తీసుకోవడం లాంటివి కూడా.. అపనమ్మకానికి కారణం.
దానికి తోడు.. ఎఫ్ఆర్డీఏ బిల్లు పేరుతో..మరో భయానక వాతావరణం తీసుకొచ్చారు. ఇప్పుడు.. డబ్బులెవరూ బ్యాంకుల్లో దాచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితికి కారణంగా కాంగ్రెస్సేనంటూ.. ఇండియాపోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. మన్మహోన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు.. ఫోన్ బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారట. ఆ ఫోన్ బ్యాంకింగ్ వల్ల.. అందరూ ఫోన్ల ద్వారానే కోట్లకు కోట్లు రుణాలు తీసుకున్నారట. అవి తిరిగి చెల్లించకపోవడం వల్లే.. బ్యాంకులకు ఇబ్బందికర పరిస్థితిలు ఏర్పడ్డాయట. ఇదీ ప్రధానమంత్రి గారి ఊవాచ. ఫోన్ బ్యాంకింగ్ అంటే.. ఫోన్ చేయగానే.. డబ్బులు బ్యాంకులో వేసేస్తారని.. ప్రధానమంత్రి ఎందుకనుకున్నారో..? ఆ అమాయకత్వాన్ని ప్రజలకు పంచాలని ఎలా అనిపించిందో కానీ.. ఏ మాత్రం తోట్రు పడకుండా చెప్పేశారు. ప్రస్తుతం పన్నెండు మంది అతి పెద్ద డిఫాల్టర్లు రూ. లక్షా 75వేల కోట్లు ఎగ్గొట్టారని.. ఇందులో ఒక్క రూపాయి కూడా.. తమ ప్రభుత్వ హయాంలో రుణాలుగా ఇవ్వలేదని మోడీ చెప్పుకొచ్చారు.
దీన్ని “ఫోన్ ఏ లోన్ స్కామ్ఠ అంటూ తనదైన శైలిలో చెప్పుకున్నారు. కాంగ్రెస్ హయాంలో మొండి బకాయిులు 12.5 లక్షల కోట్లు ఉంటే.. తమ హయాంలో అవి.. 2.5 లక్షల కోట్లేనని గొప్పగా చెప్పుకునేందుకు ఏ మత్రం ఆలోచించలేదు. నిజానికి ఆర్బీఐ లెక్కల ప్రకారం..2017-18లోనే బ్యాంకులకు పెరిగిన మొండి బాకీలు రూ. 5 లక్షల కోట్లు. బ్యాంకులు.. తమ లాభాల నుంచి రుణాలను రైటాఫ్ చేయడంతో… ఈ మూడు లక్షల కోట్లు తగ్గాయి. అంటే.. బ్యాంకులు తమ ఆదాయాన్ని మొండిబాకీల కింద సర్దుబాటు చేసుకున్నాయి. అంటే ఏడాదిలో రూ. 5 లక్షల కోట్లు.. బ్యాంకుల సొమ్ము.. మొండి బాకీలుగా మారింది. ఈ నాలుగేళ్ల కాలం లెక్కలు తీస్తే.. అరవై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఘనకార్యాలను..నాలుగేళ్లలోనే దాటిపోతారు. అయినా ప్రధానమంత్రి..తనదైన చరిత్ర వక్రీకరణలాగే.. బ్యాంకుల లెక్కలను కూడా మార్చి చెప్పుకుని… కాంగ్రెస్‌పైకి తోసేస్తున్నారు.