తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దుకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబరు 6వ తేదీన.. ఏకాదశినాడు సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయనున్నట్టు టీఆర్ఎస్ లోని అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. పంచాంగాన్ని, గ్రహబలాన్ని, తారాబలాన్ని విశ్వసించే కేసీఆర్.. జాతకరీత్యా, రాజకీయ రీత్యా అన్ని లెక్కలూ సరిచూసుకునే ఈ ముహూర్తం నిర్ణయించినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఆరో తేదీనే… అసెంబ్లీ రద్దు ఎందుకు అనేదానిపై పండితులు కూడా ఆసక్తికరమైన విశ్లేషణ చేస్తున్నారు. ప్రగతి నివేదిన సభ తర్వాత నాలుగు రోజుల్లో కేసీఆర్ కీలక సమావేశాలు నిర్వహిస్తారు. ఐదో తేదీ ఆరుద్ర నక్షత్రం.. మధ్యాహ్నం 3 గంటల దాకా ఉంది. కానీ, అది కేసీఆర్ జన్మనక్షత్రమైన ఆశ్లేషకు నైధనతార. కాబట్టి పనికిరాదు.
ఆరో తేదీ.. ఏకాదశి, గురువారం. పునర్వసు నక్షత్రం ఆరోజు మధ్యాహ్నం ఒకటిన్నర దాకా ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది. వీటిలో పునర్వసు కేసీఆర్కు మిత్ర తార కాగా, పుష్యమి పరమమైత్ర తార. కాబట్టి గ్రహబలం రీత్యా అది కేసీఆర్కు బాగా కలిసివచ్చే రోజు. మర్నాడు.. అంటే ఏడో తేదీ కూడా పుష్యమి నక్షత్రం ఉందిగానీ, మధ్యాహ్నం 11 గంటల 48 నిమిషాల వరకే ఉంది. ఆ తర్వాత ఆశ్లేష వస్తుంది. అది కేసీఆర్ జన్మ నక్షత్రం. దానికన్నా మిత్ర తార, పరమమైత్ర తార కలిసివచ్చిన ఆరో తేదీనే బాగుంటుందని పండితులు చెబుతున్నారు. పైగా, ఆరు.. కేసీఆర్ అదృష్ట సంఖ్య అన్న ప్రచారం కూడా ఉంది. తారాబలం రీత్యా చూస్తే.. సెప్టెంబరు 12, భాద్రపద శుద్ధ తదియకూడా కేసీఆర్కు బాగానే ఉంది. అంటే వినాయక చవితికి ఒక్కరోజు ముందు. ఆరోజు చిత్తా నక్షత్రం రాత్రి 7 గంటలదాకా ఉంది. అది కేసీఆర్కు ఆరో తార.. అంటే సాధన తార. అది కూడా మంచిదే. అయితే గ్రహచారాన్ని ప్రగాఢంగా నమ్మే కేసీఆర్ అశుభంగా భావించే శూన్య మాసంలో ముందుకెళ్తారా? అన్నది చాలా మందికి వస్తున్న సందేహం.
అదీగాక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాంలలో డిసెంబరు 15లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. వాటితో కలిసి ఎన్నికలకు వెళ్లాలంటే తెలంగాణలో సెప్టెంబరు 10 లోపునే అసెంబ్లీని రద్దు చేసి ఆ తీర్మానాన్ని ఈసీకి అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల కమిషన్కు 90 నుంచి 100 రోజుల సమయం అవసరం. ఈ లెక్కలన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే ఆరునే అసెంబ్లీ రద్దుకు అవకాశాలు ఎక్కువని రాజకీయ నిపుణులు, పంచాంగ కర్తలు విశ్లేషిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఆరో తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది.