తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత పక్షం రోజులుగా చేసిన హడావుడి… ఇక రేపు వెళ్లి ఓట్లేయడమే మిగిలిందని.. ప్రజలు అనుకునేంత స్థాయిలో జరిగింది. ఆయన మాటలే చెప్పాయో.. ఆయన వందిమాగధులు లీకులే ఇచ్చారో కానీ.. మీడియా కూడా … అంత కంటే గొప్పగానే.. ఎన్నికలొచ్చేస్తున్నాయన్న ప్రచారం చేసింది. అంతెందుకు కేసీఆర్ కూడా… ముందస్తు ఎన్నికలకు సిద్ధమా.. అని కాంగ్రెస్ నేతలకు సవాల్ కూడా చేశారు. అలా ఆ టెంపో.. అంతకంతకూ పెంచుకుంటూ వచ్చారు. క్లైమాక్స్.. పాతిక లక్షల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చూపిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా క్లైమాక్స్ ప్రకటన రాలేదు. త్వరలో రాజకీయ నిర్ణయమని..మరో ఘట్టం ఏదో ఉన్నట్లు హింట్ ఇచ్చారు.
నిజానికి కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనే ఉద్దేశం ఉంటే.. అంత ఖర్చు పెట్టి.. అంత భారీగా జన సమీకరణ చేసిన సభలో ప్రకటించడం కన్నా… గొప్ప సమయం ఎక్కడ దొరుకుతుంది…?. కేబినెట్‌లో తీర్మానం చేయలేదు.. కాబట్టి.. ఎలా చెబుతామని.. కొంత మంది అన్నా.. కనీసం.. ముందస్తుకు వెళ్లాలా..వద్దా ..మీరే చెప్పండి.. అని అభిప్రాయ సేకరణ అడిగి.. అయినా స్వయం నిర్ణయం తీసుకుని ఉండేవారు కదా..?. కానీ కేసీఆర్ ఏదీ చేయలేదు. ముందస్తుపై పెద్దగా ముచ్చట పెట్టకుండానే పని పూర్తి చేశారు. ఎంత చేసినా.. కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారా.. లేదా అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకే కాదు.. మంత్రులకు కూడా లేదు. కేసీఆర్ స్పీచ్‌ను రకరకాలుగా విశ్లేషించుకుంటే.. అటు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే సందేశం కనిపిస్తోందని కొందరంటారు… అసలు అలాంటి సూచనలే లేవని మరికొందరంటారు. ముందస్తుకు వెళ్లే పని అయితే.. ఎన్నికలకు సిద్ధంకమ్మని పిలుపునిచ్చేవారు కాదా..అని మరికొందరంటారు. అన్నీ వాదనలు కరెక్టే. ఏదో ఒక వాదన వింటే.. నిజమే అనుకోవచ్చు. కానీ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఏదీ నిజమో అర్థం కాని పరిస్థితి. మరో రెండు రోజుల్లోనే కేబినెట్ భేటీ జరగబోతోందని.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. బహుశా.. జాతకాల్ని అమితంగా విశ్వససించే కేసీఆర్.. ఆరో తేదీన కేబినెట్ భేటీ పెట్టి.. అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుని.. మిగతా పని పూర్తి చేసేవచ్చని అంచనాలు ఉన్నాయి.
ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. మనకు.. “మనసిచ్చి చూడు ” సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌ను గుర్తుకు తెచ్చుకోవాలి. ఓ రాజకీయ నేత అయిన ప్రకాష్ రాజ్.. ఓ సభలో ప్రసంగించడానికి వెళ్తారు. అక్కడ ఉన్న వారిని నేను ఎందుకు వచ్చానో తెలుసా అని ప్రశ్నిస్తాడు. అందరూ తెలియదంటారు. ఎవరికీ తెలియదానికి ఇక చెప్పడమెందుకు వెళ్లిపోతానంటారు. నిర్వాహకులు ఎలాగోలా బతిమిలాడి.. ప్రసంగానికి సిద్ధం చేస్తారు. మళ్లీ అదే ప్రశ్న అడుగుతాడు. ఎందుకొచ్చిన గొడవ అని.. కొంత మంది తెలుసని.. మరికొంత మంది తెలియదని అంటారు. అప్పుడు.. తెలిసిన వాళ్లు.. తెలియని వాళ్లకు చెప్పాలని.. తెలియని వాళ్లు.. తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకోవాలని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. అచ్చంగా కేసీఆర్ కూడా.. నిన్నటి సభలో అంతే చెప్పారు. అన్నీ చెప్పారు కానీ.. ఏమీ చెప్పలేదు.. అంతే..!