కెసిఆర్ ప్రగతి నివేదన సభ ముగిసింది. ముందస్తు ఎన్నికల గురించో, కొత్త సంక్షేమ పథకాల గురించో మాట్లాడుతాడు అనుకుంటే, కెసిఆర్ వాటి గురించి మాట్లాడకుండా నాలుగేళ్ల ప్రగతిని ప్రజలకు వివరించడానికి పరిమితమయ్యాడు. అయితే దానితోపాటు చాకచక్యంగా మరొకసారి ‘యాంటీ ‘ సమైక్య సెంటిమెంట్ ను రాజేసాడు కెసిఆర్.
అసలు ప్రసంగం మొదలు పెట్టడమే సమైక్య నాయకుల కరెంటు చార్జీల బాదుడు అంటూ మొదలు పెట్టాడు కేసీఆర్. అక్కడితో ఆగలేదు, సమైక్య అహంకారులు, సమైక్య దొరలు, ఇలాంటి పదాలు ఎక్కడికక్కడ ప్రయోగిస్తూ సమైక్యవాదుల మీద మరొకసారి వ్యతిరేకత కనపరుస్తూ ప్రజల్లో కూడా ఉద్యమ కాలం నాటి ఈ యాంటీ సమైక్య సెంటిమెంటును మరొకసారి తట్టి లేపాడు.
అటుపక్క ఢిల్లీకి గులాం కావద్దు అని చెబుతూ -కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నిర్ణయాధికారాలు తెలంగాణలో ఉండవని కాంగ్రెస్ హై కమాండ్ ఢిల్లీ నుంచి అన్నీ నిర్ణయిస్తుందని సంకేతాలు పంపి, కాంగ్రెస్ అవకాశాల కు గండి కొట్టడానికి ప్రయత్నించిన కెసిఆర్, సమైక్య అహంకారులు అని చెప్పడం, సమైక్యవాదుల కాలంలో కరెంటు చార్జీలు పెంచడం అంటూ పరోక్షంగా చంద్రబాబు పాలనను ప్రస్తావించడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ పొత్తు ల ద్వారా మళ్లీ తెలంగాణలో బలపడే యత్నాలను కూడా ఆదిలోనే తుంచడానికి చేసిన ప్రయత్నం లాగా కనిపిస్తోంది.