ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని పొగడ్తలతో ముంచెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాజ్యసభ అధ్యక్షుడిగా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూవింగ్ ఆన్.. మూవింగ్ ఫార్వర్డ్ అనే పుస్తకాన్ని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయనకి ఉన్న అలవాట్ల నుంచి బయటపడి, ఇప్పుడు చేస్తున్న కొత్త పనిని అభినందిస్తున్నా అన్నారు. సభలో ఆయన్ని గమనిస్తున్నాననీ, తనని తాను నిగ్రహించుకునేందుకు ఆయన ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నానని మోడీ అన్నారు! పదవి కంటే చేస్తున్న పనికి ఎక్కువ గౌరవం ఇచ్చే వ్యక్తి వెంకయ్య నాయుడు, అలాంటివారితో కలిసి పనిచేసే అవకాశం తనకు వచ్చిందని మోడీ చెప్పారు. క్రమశిక్షణ వెంకయ్య నాయుడు రక్తంలో ఉందనీ, దేశంలో ప్రస్తుతం క్రమశిక్షణ గురించి మాట్లాడటమే పెద్ద తప్పుగా మారిందని మోడీ అన్నారు.
వెంకయ్య నాయుడు పనితీరును మోడీ మెచ్చుకుంటూ ఉంటే.. ఆయన్ని ఇంకా భాజపా కళ్లతోనే మోడీ చూస్తున్నట్టుగా వినిపిస్తోంది..! వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయిన దగ్గర నుంచీ తాను భాజపాకి దూరంగా ఉంటున్నాననీ, క్రియాశీల రాజకీయాల్లో లేనని పదేపదే చెప్పుకుంటూ వస్తున్నారు. తనకి ప్రోటోకాల్ ఉందనీ, ఇప్పుడు కొన్ని పరిధులకు లోబడి ఉండాల్సి వస్తోందని చాలా సభల్లో చెప్పారు. నిజానికి, ఉప రాష్ట్రపతి అయిన తరువాత భాజపా భావజాలం నుంచి బయటపడటానికి వెంకయ్య నాయుడుకి చాలా సమయం పట్టిందనే చెప్పొచ్చు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికీ ఆయన్ని పార్టీ కోణం నుంచి చూస్తున్నట్టుగానే మాట్లాడటం గమనార్హం.
సభా నిర్వహణలో ఆయన పడుతున్న కష్టం చూస్తున్నా అనడం విడ్డూరం! ఆయన భాజపాకి అనూకూలంగా వ్యవహరించడం లేదూ అని పనిగట్టుకుని మోడీ చెప్పినట్టుగా ఉంది. నిజానికి, గత పార్లమెంట్ సమావేశాల్లో… ఇతర పార్టీలకు వెంకయ్య నాయుడు సరిగా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనీ, ప్రతీదానికీ అడ్డుపడుతున్నారనీ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై చర్చకు ఆస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ మేరకు ఒక ఫిర్యాదును కూడా అన్ని పార్టీలు సిద్ధం చేసుకున్న పరిస్థితి! ఇలాంటి పరిస్థితుల్లో పనిగట్టుకుని ‘ఆయన కష్టపడుతున్నారు’ అని మోడీ చెప్పడం ద్వారా… భాజపా భావజాలం నుంచి వెంకయ్య ఇప్పటికీ బయపడటం లేదని ప్రధానే స్వయంగా చెప్పినట్టుంది. అయినా, రాజ్యంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు, దానికి అనుగుణంగానే విధి నిర్వహణ ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధానమంత్రి కూడా పార్టీలకు అతీతంగానే వ్యవహరించాలి. కానీ, తనని తాను భాజపా ప్రతినిధిగానే ఎప్పటికప్పుడు బలంగా ప్రొజెక్ట్ చేసుకోవడమే మోడీ పనితీరులో కనిపిస్తోంది.