‘మహానటి’లో తన పాత్రకు సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది! అంతకు ముందు ‘అజ్ఞాతవాసి’తో కీర్తీ సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ తమ తమ సొంత గొంతులు వినిపించారు. ‘అరవింద సమేత వీర రాఘవ’తో పూజా హెగ్డే కూడా సొంత గొంతు వినిపించబోతోంది. సినిమాలో తన పాత్రకు ఆమె డబ్బింగ్ చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎక్కువశాతం మంది కథానాయికలు తమ సొంత గొంతు వినిపించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలో మెహరీన్ కౌర్ కూడా చేరాలని ఆశ పడుతోంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇప్పటివరకూ అరడజను తెలుగు సినిమాలు చేసింది. ఏ చిత్రానికీ డబ్బింగ్ చెప్పలేదు. ఆ మాటకు వస్తే డైలాగులకు లిప్ సింక్ సరిగా ఇవ్వదనే విమర్శ ఆమెపై వుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ‘ఎఫ్2’లో వరుణ్ తేజ్‌కి జోడీగా నటిస్తున్నది. ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశను వ్యక్తం చేసింది. ‘ఎఫ్2’లో మెహరీన్‌ది ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్ అట. సొంత గొంతు వినిపిస్తేనే పాత్రకు న్యాయం చేయగలనని ఈ పంజాబీ ముద్దుగుమ్మ చెబుతోంది. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ఏమంటారో? మెహరీన్ ప్రతిపాదనకు ఒప్పుకుంటారో? లేదో??