‘మా’ (మూవీ ఆర్టిస్ అసోసియేషన్)లో వర్గ విబేధాలు చిలికి చిలికి గాలివానలా కాకుండా పెను తుఫానులా మారాయి. అమెరికాలో జరిగిన ‘మా’ టూర్ లో పెద్ద స్కాం జరిగిందని సీనియర్ నరేశ్, రాజేంద్రప్రసాద్ వర్గం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల్లో నిజం లేదని, ఐదు పైసలు దుర్వినియోగం చేశానని నిరూపించినా రాజీనామా చేస్తానని ఈ రోజు ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీకాంత్, తన ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తానని శివాజీ రాజా మాట్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు పరుచూరివెంకటేశ్వరరావు కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీళ్లకు కౌంటర్ ఇచ్చేందుకు సీనియర్ నరేష్ వర్గం కాసేపట్లో మీడియా ముందుకు రానుంది. మీడియా ముందుకు వచ్చే ముందు నరేష్ వర్గం చిరంజీవి ఇంటికి వెళ్లింది. ఆయనతో మాట్లాడుతున్నారు. చిరు స్పందన ఏంటి? నరేష్ మీడియా ముందు ఏం చెబుతారు? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది!!