తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను రహస్యంగా కలిశారా..?. అవుననే అంటున్నారు నిన్నామొన్నా.. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్. టీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని.. ఉత్తమ్ కుమార్ .. చేసిన విమర్శలకు కౌంటర్ గా దానం.. చాలా మాట్లాడారు కానీ… చివరిలో ఈ మాట చెప్పుకొచ్చారు. తర్వాత కాసేపటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై స్పందించారు. దానం నాగేందర్‌కు తిక్కలేచి తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై విమర్శలు చేసే నైతికత భూకబ్జాదారుడికి ఎక్కడుందన్నారు. ముందు వాడు ఎంతకు అమ్ముడు పోయాడో చెప్పాలని కంట్రోల్ తప్పి పోయారు. పిచ్చోడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు.
ప్రగతి నివేదన సభ విజయవంతం అయిందా..? అట్టర్ ఫ్లాప్ అయిందా అనే అంశంపై.. ఉదయం నుంచి ఓ వైపు టీఆర్ఎస్ .. మరో వైపు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. ఎవరి వెర్షన్లు వారు వినిపిస్తూనే ఉన్నారు. సహజంగానే.. ఇందులో ఎవరి గోల వారిది. కానీ దానం మాత్రం… ఉత్తమ్ నే గురి పెట్టారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల విశ్వసనీయత దెబ్బతీయడానికి వారిపై అనేక అనుమానాలు రేకెత్తించడానికి నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇందులో దానం కొత్త కోణం జోడించారు. ఇందులో నిజం ఎంత ఉంది..? అన్న సంగతిని పక్కన పెడితే… చర్చనీయాంశం అవడం మాత్రం ఖాయం. దానంకు, టీఆరెస్‌కు కావాల్సింది కూడా అదే.
వాస్తవంగా చూసుకుంటే.. పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కలిస్తే.. తన పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తారు కానీ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఎందుకు కలుస్తారు..? ఆ పార్టీ ఏమైనా తెలంగాణలో గేమ్ ఛేంజర్ లా ఉందా..?. పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా తేడా కొట్టిందా..?. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నా.. ఉత్తమ్ పై రాహుల్ నమ్మకం పెట్టుకున్నారని.. ఇటీవలి పరిణామాలు నిరూపిస్తూనే ఉన్నాయి. మరి ఉత్తమ్ కు ఏం అవసరం ఉంటుంది..? . అలాంటి భేటీ జరిగి ఉంటుందని కాంగ్రెస్ లో కూడా ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఉత్తమ్ వ్యతిరేకులకు మాత్రం ఇది చాలా నచ్చుతుంది. నిజానికి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కు సన్నిహితంగానే మెలిగారు. పార్టీ మారేసరికి విధానం కూడా మారిపోయింది.