ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆరో తేదీ నుంచి జరగనున్నాయి. కనీసం 10 పని దినాలు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సహజంగానే అసెంబ్లీ సమావేశాలంటే.. ముందుగా.. అందరి దృష్టి ప్రతిపక్ష పార్టీ వైపు పడుతుంది. ఎందుకంటే.. ఆ పార్టీ ఇప్పటికే రెండు సెషన్లుగా.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఈ సారి అయినా వస్తుందా రాదా అన్నదే ఆ సందేహం. నిజానికి ఇక అసెంబ్లీకే రాబోమని.. గతంలోనే ప్రకటించారు. కానీ రాజకీయ పరిణామాలు అంతకంతకూ మారిపోతున్నాయి. ఎన్నికల వాతావరణం వెడెక్కుతోంది. ఎమ్మెల్యేల నుంచే.. అసెంబ్లీకి వెళదామనే వినతులు.. జగన్‌కు అందుతున్నట్లు ప్రచారం కూడ జరుగుతోంది.
ప్రజాస్వామ్యంలో చట్టసభలే ఫైనల్. ప్రజలు ఎంపీలు, ఎమ్మేల్యేల్ని ఎన్నుకునేది.. ఇసుక దందాలు చేసుకోమనో.. ప్రజలపై పెత్తనం చేయమనో కాదు. కేవలం చట్టసభలకు వెళ్లి చట్టాలు చేయమనే. ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత ఇది. రాజ్యాంగం నిర్దేశించినది ఇదే. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట సభను ఏ మాత్రం నమ్మలేకపోతోంది. చట్టసభల్ని నమ్మకపోతే.. ప్రజాస్వామ్యాన్ని నమ్మనట్లేనని ఎవరు చెప్పినా వినిపించుకోవడం లేదు. ఎంపీలతో జగన్ రాజీనామాలు చేయించారు. అదీ కూడా.. ఉపఎన్నికలు రాని తేదీని చూసి.. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో.. అటు చట్టసభల్లో ఎంపీలతో …ఇటు వారిని ఎన్నుకున్న నియోజకవర్గాల ప్రతినిధి కూడా లేకుండా పోయారు. ఇదే పెద్ద సెల్ఫ్‌గోల్‌గా ప్రచారం జరిగింది. దీని తర్వాతనే చాలా మంది ఎమ్మెల్యేలు జగన్‌పై అసెంబ్లీకి వెళదామని ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో వివిధ వర్గాల నుంచీ.. అసెంబ్లీకి ఎందుకు వెళ్లరనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొత్త ఉపాధ్యాయుల సభలోనే అదే విమర్శ వినిపించింది.
కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఏది అనుకుంటే అది చేస్తారు. గతంలో కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకూ.. అసెంబ్లీకి రానని చెప్పారు. ఇప్పుడు దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నారు. అయితే.. కొత్తగా మరో ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. సామూహిక రాజీనామాలు. ప్రజల్లో సెంటిమెంట్ పెంచడానికి ఈ సామూహిక రాజీనామలు చాలా బాగా ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. ఎంపీలు రాజీనామాలు చేసి ఏం సాధించారు..? ఇప్పుడు తమతో ఎందుకు రాజీనామాలు చేయించాలనకుంటున్నారని.. వైసీపీ నేతలు మథన పడినా… న్యాయం చేయని అసెంబ్లీ స్పీకర్ తీరుకు నిరసగా రాజీనామాలు చేయాలని..జగన్ ఆదేశించే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. చివరికి .. జగన్ కు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అసలు నమ్మకం లేదని అనుకోవాల్సి వస్తుంది.