నోట్ల రద్దు నిర్ణయం సూపర్ హిట్ అయిందనీ, దేశంలో ఆదాయ పన్ను రిటర్న్స్ అనూహ్యంగా పెరిగాయనీ, ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు వచ్చిందంటూ భాజపా సర్కారు ఈ మధ్య కొత్త ప్రచారానికి తెరలేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆదాయం అద్భుతంగా పెరిగిందని చెబుతున్నారుగానీ… పెట్రో ధరలు తగ్గించడంపై మోడీ సర్కారు ఇప్పటికీ దృష్టి మరల్చడం లేదు. రోజురోజుకీ ధరలు పెరిగిపోతున్నాయి. గడచిన పది రోజుల్లో దాదాపుగా రెండు నుంచి మూడు రూపాయలు ధర పెరిగింది. ప్రతీరోజూ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉండటంతో, రోజుకి కొన్ని పైసల చొప్పున ఈ వడ్డన జరుగుతోంది. తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ… అంతర్జాతీయంగా రూపాయి మారకం పెరగడం వల్లనే పెట్రో ధరలు పెంచాల్సి వస్తోందన్న వాదననే కేంద్రం వినిపిస్తోంది.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత పెట్రోల్ మీద రూ. 14 ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. అదే, గత ఎన్డీయే హయాంలో చూసుకుంటే… అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఒక పీపాకి దాదాపు 150 డాలర్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా లీటర్ పెట్రోల్ రూ. 75కి ఉండేది. కానీ, మోడీ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ ముడి చమురు ధరలు అనూహ్యంగా తగ్గిపోయాయి. 50 డాలర్లలోపు ముడిచమురు లభిస్తున్నా, ఆ మేరకు డీజిల్, పెట్రోల్ ధరల్ని ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చెయ్యలేదు. ప్రస్తుతం ఓ 70 డాలర్లకుపైగా ముడి చమురు ధర ఉంది. పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించుకునే అవకాశం ఉంది. కనీసం, ఇది ఎన్నికల సంవత్సరం అయినప్పటికీ కూడా ఆ దిశగా మోడీ సర్కారు ఆలోచించడం లేదు.
అది చాలదన్నట్టుగా… కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పందిస్తూ ధరల పెరుగుదలకు కారణాలు ప్రజలకు అర్థం కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు! అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ధరలు పెంచాల్సి వస్తోందని అన్నారు. ఇంతకీ, ఆ ప్రతికూల పరిస్థితులు ఏంటనేది చెప్పలేదు! గడచిన రెండు వారాలుగా ప్రతీరోజూ పెట్రోల్, డీజిల్ పై ఎన్నో కొన్ని పైసల పెంపు జరుగుతూనే ఉంది. డిసెంబర్ నాటికి లీటర్ పెట్రోల్ రూ. 100కి చేరిపోవడం ఖాయం అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, పెరుగుతున్న ధరలపై సామాన్యుడు తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మోడీ సర్కారపై మరింత పెంచే మరో అంశంగా మారడం ఖాయం. నోట్ల రద్దు సూపర్ హిట్ అయిందన్న ప్రచారమే పుండు మీద కారంలా ఉంటోంది. ఇప్పుడు, పెట్రో ధరలపై ఇలా మాట్లాడుతూ ఉండటం మరింత ఆగ్రహాన్ని పెంచడమే అవుతుంది.