హీరోగా సరైన హిట్లు లేకపోవడంతో మళ్లీ కమెడియన్ గా యూటర్న్ తీసుకున్నాడు సునీల్. ఇప్పుడు తనకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. పారితోషికమూ బాగానే గిట్టుబాటు అవుతోంది. కానీ మనసులో మాత్రం హీరోయిజంపై మమకారం పోలేదు. అందుకే `నాకు తగిన కథలు వస్తే హీరోగా చేయడానికి రెడీనే` అంటున్నాడు. అందుకు తగ్గట్టుగా తెర వెనుక ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఇప్పుడు హీరోగా ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడని టాలీవుడ్ టాక్. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ నటించబోతున్నాడని సమాచారం. ఎన్నో మాస్, కమర్షియల్ చిత్రాలకు కథ అందించాడు వెలిగొండ శ్రీనివాస్. రాజ్ తరుణ్ ‘అంధగాడు’తో దర్శకుడిగా అవతారం ఎత్తాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు సునీల్ కోసం ఓ కథ రాసుకున్నాడట. అది సునీల్‌కి నచ్చడం, ‘ఓకే’ అనడం జరిగిపోయాయి. దసరాకి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడే ముమ్మర అవకాశాలు అందుకుంటున్న సునీల్ కి రూటు మార్చాలని ఎందుకు అనిపించిందో..?? హీరోగా ఛాన్సులు వస్తే… మళ్లీ కామెడీ వేషాలకు గండి పడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో సునీల్ కాస్త ఆచి తూచి అడుగులేస్తే మంచిదేమో.