మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రస్తుతం కొనసాగుతున్న రగడ తెలిసిందే. నిధులు దుర్వినియోగం అయ్యాయని సీనియర్ నరేష్ ఆరోపిస్తుంటే, శివాజీ రాజా, శ్రీకాంత్, పరచూరి వెంకటేశ్వరరావు తదితరులు ఎటువంటి దుర్వినియోగం జరగలేదని సమాధానం ఇస్తున్నారు. అయితే ట్విట్టర్లో మంచు మనోజ్ ని ఒక నెటిజన్ మీరు “మా” ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని సూచించగా దానికి వెరైటీగా స్పందించాడు మంచు మనోజ్.
నెటిజన్ చేసిన సూచనకు స్పందిస్తూ మంచు మనోజ్, “నేను అక్కడికి వెళితే అందరికీ “ఫసకే”. అయినా మా బాగా పనిచేస్తోందని నా నమ్మకం. ఒక రివిజన్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని ‘మా’ రుజువు చేసుకుంటే సరిపోతుంది. ఆరోపణలు అన్నీ అబద్ధాలు అని రుజువు చేయాల్సిందిగా ‘ మా’ ని కోరుతున్నాను” అంటూ స్పందించాడు మంచు మనోజ్.
అంతా బానే ఉంది కానీ ఇక్కడ ఈ “ఫసక్” గోల ఏంటి అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం. గత కొద్ది రోజులుగా ఈ పదం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఆ మధ్య ఒక ఇంగ్లీష్ ఛానల్ కి మోహన్ బాబు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఈ పదాన్ని వాడారు. ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఇంగ్లీషులో వివరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు
సరైన ఆంగ్ల పదం తట్టకో మరి ఎందుకో కానీ ఆయన ‘ఫసక్ ‘ అనే పదాన్ని వాడారు. “ఒక్క దెబ్బలో చంపడం” అన్న భావాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేసే ప్రయత్నంలో ఆయన ఈ పదాన్ని వాడారు.
అయితే ఇంగ్లీషులో అలాంటి పదం ఏది లేకపోవడంతో సోషల్ మీడియాలో జనాలు రెచ్చిపోయారు. ఈ పదాన్ని ఉపయోగిస్తూ మోహన్ బాబు మీద , మంచు లక్ష్మి మీద తెగ వీడియోలు చేశారు. స్పూఫ్ వీడియోలు, ట్రోలింగ్ కామెంట్లతో ఈ పదాన్ని తెగ ట్రెండింగ్ చేసేశారు.
మామూలుగా మరొకరైతే హర్ట్ అయ్యేవారేమో కానీ, మోహన్ బాబు ఈ పదాన్ని ఇంతగా ట్రెండింగ్ చేసినందుకు సంతోషం గా ఉందంటూ హాయిగా నవ్వేస్తూ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆ పదం బాగా పాపులర్ కావడంతో మంచు మనోజ్ కూడా అదే పదాన్ని ఉపయోగిస్తూ ట్వీట్ చేయడం నెటిజన్లను అలరించింది.