బోయపాటి శ్రీను సినిమా అంటేనే యాక్షన్ హంగామా ఎక్కువగా ఉంటుంది. కథానాయకుడ్ని, అతనిలోని హీరోయిజాన్ని చూపించడంలో బోయపాటి మార్క్ బలమైనది. అందుకే స్టార్ హీరోలు తనతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ మార్క్ మరోసారి రామ్ చరణ్ సినిమాలో కనిపించబోతోందని సమాచారం. రామ్‌చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం యూరోపియన్ దేశమైన అజర్ బైజాన్‌లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరణ జరుపుతారు. ఈ నెలరోజుల్లో దాదాపుగా యాక్షన్ ఎపిసోడ్‌కే కేటాయించార్ట. ఓ యాక్షన్ ఎపిసోడ్, దాని లీడ్ సీన్ల కోసమే చిత్రబృందం అంత దూరం వెళ్లిందని తెలుస్తోంది.
ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం బోయపాటి చాలా కసరత్తు చేశాడని సమాచారం. రామ్‌చరణ్ అనగానే మగధీర గుర్తుకురావడం ఎంత సహజమో, మగధీర అనగానే వంద మందిని ఒంటి చేత్తో ఎదిరించే కాల భైరవ గుర్తొస్తాడు. ఆ ఎపిసోడ్ ‘మగధీర’ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. దాన్ని మించేలా ఓ యాక్షన్ ఎపిసోడ్ ని రూపొందిస్తున్నాడట బోయపాటి. ఇది కూడా మగధీరలానే రెండు కొండల మధ్య, గుట్టల మధ్య.. లోయల్లో తెరకెక్కిస్తున్నాడని టాక్. సింహా, లెజెండ్, సరైనోడు లలో..బోయపాటి రూపొందించిన యాక్షన్ దృశ్యాలకు మంచి పేరొచ్చింది. రామ్‌చరణ్ సినిమాలో నాలుగు యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయట. నాలుగూ… వేర్వేరు స్టైల్స్‌లో సాగుతూ మాస్‌ని అలరిస్తాయని, అజర్ బైజాన్ ఎపిసోడ్ మాత్రం క్లైమాక్స్ కోసం కేటాయించారని తెలుస్తోంది.