తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ.. ముఖ్యమంత్రి గవర్నర్కు కేబినెట్ తీర్మానం ఇచ్చి.. దానికి ఆమోదముద్ర పడిన తర్వాత.. ఆపద్ధర్మ సీఎంగా.. కేసీఆర్ కొనసాగడం.. ఖాయమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కీడెంచి మేలెంచమన్నట్లు కేసీఆర్.. తన జాగ్రత్తలో తాను ఉన్నారు. అధికారులతో ఇప్పటికే లోతుగా అధ్యయనం చేయించారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండే అధికారుాలపై ఓ ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా పరిశీలన జరిపింది. అసెంబ్లీని రద్దు చేస్తే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించడం ఈసీ విధి. వాయిదా వేయడానికి వీల్లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముందుగానే అసెంబ్లీని రద్దు చేసినా అరునెలలలోపే ఎన్నికలు నిర్విహించారు. 2003 నవంబర్ 15 న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీని రద్దు చేశారు. నాటి నుండి ఆరు నెలలలోపు ఎన్నికలు పూర్తి కావడమే కాకుండా గడవు కంటే ఒక్క రోజు ముందే అంటే మే 14 ,2004 నే అసెంబ్లీ సమావేశమైంది. ఇవే కాకుండా సుప్రీం కోర్టు తీర్పులు కూడా 6 నెలలలోపే ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టంగా ఉన్నాయి. దీంతో నాలుగు రాష్ట్రాలతో ఎన్నికలు నిర్వహించకపోయినా ఆరు నెలలలోపు అంటే ఫిబ్రవరి నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని నివేదికను ఉన్నతాధికారులు కేసీఆర్కు అందించారు. అప్పట్లో చంద్రబాబు కోరుకున్న విధంగా మూడు నాలుగు నెలలలోపు నిర్వహించకపోయినా ఆరు నెలల నిబంధన పాటించాల్సి వచ్చిందని చెప్తున్నారు..
ఎన్నికలు పూరైయ్యే వరకు ఉండే ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండే అధికారాలపై ఇప్పటికే ఓ నివేదిక తయారు చేశారు. ఎన్నికల కోడ్ కిందకు వచ్చే వరకు కొన్ని విషయాలు మినహాయిస్తే సాధారణ ప్రభుత్వానికి ఉండే అన్ని అధికారాలు ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉంటాయని చెప్తున్నారు. ఈ విషయంలో 1971లో యుఎన్ రావు వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తొంభై ఒక్క పేజీలో తీర్పులో ఆపద్ధర్మ ప్రభుత్వ అధికారాలను స్పష్టంగా వివరించిందని అభిప్రాయపడుతున్నారు. కరుణానిధిపై కేసు విషయంలోనూ మద్రాసు హైకోర్టు మరోసారి దీనిని బలపరిచిందని చెప్తున్నారు .దీంతో ఆపద్ధర్మ ప్రభుత్వంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని కేసీఆర్ ఓనిర్ణయానికి వచ్చారు.