తెలుగుదేశం పార్టీని గత కొద్ది రోజులుగా ఇబ్బంది పెట్టిన అంశం.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు. తెలంగాణ సంగతేమో కానీ.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం.. పొత్తుపై జరుగుతున్న ప్రచారం విషయంలో తమ ఆవేశాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయారు. కొంత మంది సైలెంట్‌గానే ఉన్నా.. సీనియర్ నేతలు మాత్రం.. ఎమోషన్‌ను ఆపుకోలేకపోయారు. కాంగ్రెస్‌తో పొత్తంటే.. ప్రజలు బట్టలిప్పదీసి కొడతారని మంత్రి అయ్యన్న పాత్రుడు… నర్సీపట్నం స్టైల్లో వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇక డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా.. అదే తరహాలో స్పందించారు. ఇతర మంత్రులు.. అటూ ఇటూగా అదే తరహాలో తమ అభిప్రాయం వినిపించారు. చివరికి చంద్రబాబు జోక్యం చేసుకుంటే తప్ప అందరూ సైలెంట్ కాలేదు. కానీ ఇప్పటికీ.. కేఈ కృష్ణమూర్తి.. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదే ఉండదని.. తనకు చంద్రబాబు చెప్పారని.. ఎక్కడ మీడియా కనిపించినా చెబుతున్నారు.
జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాలతో.. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ దగ్గరవుతోంది. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా పడుతోంది. కేంద్రంలో వచ్చే ప్రభుత్వం అండ ఏపీకి ఉండాలి కాబట్టి.. టీడీపీ అధినేత వ్యూహాత్మకంగా.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. ఇది తెలంగాణలో టీడీపీకి జోష్ తెచ్చి పెట్టింది. వారంతా.. కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అంటున్నారు. కానీ ఏపీ టీడీపీలో మాత్రం వ్యతిరేకత వచ్చింది. చిక్కులు తెచ్చి పెట్టింది. ఇప్పుడు.. సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ.. ఏపీ పర్యటనకు వచ్చి ఏపీలో అసలు ఏ పార్టీతోనూ పొత్తులుండవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వీరప్పమొయిలీ ప్రకటనను కాంగ్రెస్ నేతలు.. ఎలా తీసుకున్నారో కానీ.. టీడీపీ నేతలకు మాత్రం చాలా ఆనందాన్ని తెచ్చి పెట్టిందనే చెప్పాలి.
తెలంగాణలో పొత్తు పెట్టుకుంటారో లేదో తమకు సంబంధం లేదని.. ఏపీలో పొత్తు మాత్రం వద్దనేది.. చాలా మంది టీడీపీ నేతల భావన. బహుశా టీడీపీ అధినేత చంద్రబాబుకి కూడా అదే ఆలోచన ఉండి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు కలసి వస్తున్నాయి. తెలంగాణలో ముందస్తు జరిగితే.. అక్కడ పొత్తులతో బండి లాగించేయవచ్చు. తర్వాత ఏపీలో పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. అప్పటి పరిస్థితులను బట్టి సమర్థించుకోవచ్చు. ఓ రకంగా పొత్తు లేదనే ప్రకటన.. ఏఐసిసి స్థాయి నాయకుడ్ని నుంచి రావడం.. ఏపీ టీడీపీకి సంతోషాన్ని కలిగించేదే. వీరప్పమొయిలీ ఇక్కడ కాస్త చాణక్యాన్ని చూపించారు. ఆయన తెలంగాణ గురించి మాట్లాడలేదు. ఒక్క ఏపీ గురించే మాట్లాడారు.