తనయుల్ని ప్రమోట్ చేసుకోవడడంలో తండ్రులు తలమునకలైపోయి ఉన్నారిప్పుడు. ఓ బెల్లంకొండ సురేష్… ఓ ఎమ్మెస్ రాజు.. అతి పెద్ద ఉదాహరణలు. నాగశౌర్య తండ్రి కూడా ఓ సంస్థ స్థాపించి.. కొడుకు సినిమాల్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే… బ్రహ్మానందం మాత్రం ఈ విషయంలో చాలా వెనుకే ఉండిపోయాడు. తనయుడు రాజా గౌతమ్ నుంచి ఓ సినిమా వస్తోందిప్పుడు. అదే… `తను`. ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. థ్రిల్లర్ తరహా సినిమా కాబట్టి.. ఈ సినిమాకంటూ ఓ మార్కెట్ కూడా ఉంది. మల్టీప్లెక్స్‌లో ఇలాంటి సినిమాల్ని బాగా చూస్తారు. ప్రమోషన్లు ఓ మాదిరిగా సాగుతున్నా.. ఎక్కడో చిన్న అసంతృప్తి. బ్రహ్మానందం కూడా వచ్చి ఓ చేయి వేస్తే బాగుండేది కదా? అని. రాజా గౌతమ్ గత చిత్రం `బసంతి` విషయంలో బ్రహ్మానందం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రమోషన్లను పక్కాగా ప్లాన్ చేశాడు. బ్రహ్మానందంపై గౌరవంతో దర్శకులు, కథానాయకులు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. `మను` విషయంలోనూ అదే జరుగుతుందనుకున్నారు. కానీ…. బ్రహ్మానందం నుంచి అలికిడి లేదు. అసలు బ్రహ్మానందం కెరీరే డైలామాలో ఉంది. సినిమాలు మానేసి టీవీ షోలు చేసుకోవాలని డిసైడ్ అయ్యారాయన. పైగా వాడుకోవాల్సినవాళ్లందరినీ `బసంతి`కి వాడేశాడు బ్రహ్మీ. అయితే ఆ సినిమా అంతగా వర్కవుట్ అవ్వలేదు. మళ్లీ ఈసారి కూడా నోరు విప్పి, ప్రచారం గట్టిగా చేసి, తీరా సినిమా విడుదలై తేలిపోతే.. తన ప్రచారానికి విలువ ఉండదని బ్రహ్మీ భయపడ్డాడేమో. సినిమా విడుదలై, మంచి టాక్ వస్తే.. అప్పుడు తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని, తన వంతు సాయం చేస్తానని బ్రహ్మానందం మాట ఇచ్చాడట. మున్ముందు బ్రహ్మానందం కూడా ప్రమోషన్ బరిలో దిగుతాడేమో చూడాలి.