తెలంగాణ రాష్ట్ర సమితిలో మళ్లీ హరీష్ రావు ప్రాధాన్యత పెరుగుతోందా..?. ప్రగతి నివేదన సభ ముగిసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే.. నిజమని అనిపించకమానదు. పాతిక లక్షల మందితో సభ నిర్వహిస్తామని.. ఆ పార్టీ నేతలు ఎంత ప్రచారం చేసినా.. ఎంత భారీగా ఏర్పాట్లు చేసినా… అక్కడకు వచ్చిన జనం నాలుగైదు లక్షల మంది కూడా లేరు. ఇది టీఆర్ఎస్ అధినేతకు.. పెద్దగా రుచించలేదు. సభా నిర్వాహకులపై ఆయన అసహనం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. అయితే ఈ సభ ఫెయిలైన విషయంపై..టీఆర్ఎస్లోనూ అంతర్గత చర్చలు జరిగాయి. అదే “హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించి ఉంటే..” అన్న రీతిలో ఈ చర్చలు జరిగాయి. వెంటనే కేసీఆర్ అప్రమత్తమయ్యారు. సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా… ప్రగతిభవన్‌కు హరీష్ రావును పిలిపించి మాట్లాడారు. యాభై రోజుల్లో నిర్వహించాలనుకున్న వంద సభల బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు.
కొన్నాళ్ల క్రితం వరకూ.. హరీష్ రావు .. టీఆర్ఎస్లో బలమైన వర్గానికి నాయకత్వం వహించేవారు. కేటీఆర్, హరీష్‌కు ప్రత్యేకంగా మద్దతు దారులు ఉండేవారు. అయితే కేసీఆర్.. పూర్తిగా హరీష్‌ను పక్కన పెట్టడం ప్రారంభించిన తర్వాత చాలా మంది హరీష్ వైపు చూడటం మానేశారు. కానీ వారంతా.. తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే.. కేటీఆర్ వర్గంగానే చెలామణి కావాలని మంచిదని ఫిక్సయ్యారు. కానీ వారిలో హరీష్‌పై ఉన్న అభిమానం అవసరమైనప్పుడు బయటకు వస్తుందని టీఆర్ఎస్లో ఓ ప్రచారం ఉంది. ఈ లోపే కేటీఆర్‌ను… హరీష్ రావు కన్నా.. ప్రతిభావంతుడని.. ఏ సమస్యనైనా డీల్ చేయగలడని నిరూపించేందుకు కేసీఆర్ కొన్ని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే.. హరీష్ రావు అధ్యక్షుడిగా ఉన్న ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం .. సమ్మె హెచ్చరికలను.. కేటీఆర్ చేతుల మీదుగానే పరిష్కరింప చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అదే కాదు.. దాదాపు ప్రభుత్వం మొత్తం .. కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తోంది. దీంతో.. హరీష్ రావు మెల్లగా సైడైపోయారు.
కానీ ప్రగతి నివేదన సభ తర్వాత .. హరీష్‌రావును దూరం పెట్టడం మంచిది కాదని.. కేసీఆర్ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందస్తుకు వెళ్లాలనుకుంటున్న సమయంలో.. హరీష్ రావును దూరం పెడితే ఇబ్బంది అవుతుందని గమనించి మళ్లీ యాక్టివ్ చేయాలని డిసైడయ్యారు. అందులో భాగంగానే వంద సభల నిర్వహణ అప్పగించారు. మొత్తంగా పాతిక నియోజకవర్గాల బాధ్యతను కూడా అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. గెలుపు బాధ్యతలు తీసుకోవాలంటే.. అక్కడ తను చెప్పిన వారికే టిక్కెట్లివ్వాలని హరీష్ రావు పట్టుబడతారు. అంటే.. తన పట్టు పెంచుకోవడానికి అవకాశం వచ్చినట్లే. మరి దీన్ని హరీష్ వినియోగించుకుంటారో…? లేక కేసీఆర్ తనదైన శైలిలో మళ్లీ హరీష్‌ను .. పరిమితం చేస్తారో వేచి చూడాల్సిందే. ..!