రేపట్నుంచీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. దాదాపు పదిరోజులపాటు సభ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ వైకాపా గడచిన సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో కూడా అదే పరిస్థితి. అయితే, ఈ సమావేశాలకు హాజరు కావాలంటూ వైకాపా ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలకు స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు గడచిన రెండ్రోజులుగా ఫోన్లు చేస్తున్నారు. సభకు వస్తే బాగుంటుందనీ, ప్రజా సమస్యల్ని ఇక్కడ చర్చించుకునే అవకాశం ఉంటుందంటూ ఆయన కొంతమంది వైకాపా ఎమ్మెల్యేతో ఫోన్ చేసి పిలిచారు. సభకు హాజరు కాకూడదని పార్టీ నిర్ణయించిందనీ, దాన్ని కాదని హాజరు కాలేమని స్పీకర్ తో పలువురు వైకాపా సభ్యులు చెప్పినట్టు సమాచారం.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకూ సభకు హాజరయ్యే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేశారని తెలుస్తోంది. అయితే, ఈ నెల ఆరు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని మాత్రమే స్పీకర్ చెప్పారుగానీ, తమను రమ్మంటూ ఆయన పిలవలేదని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతంలో ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడున్న సందర్భంలో మైకులు కట్ చేశారనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో స్పీకర్ కోడెల కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపించారు.
వాస్తవం మాట్లాడుకుంటే.,. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇప్పటికిప్పుడు వైకాపా ఎంత పట్టుబట్టినా జరిగేవి కావు. పైగా, వీరిపై కోర్టుకు వెళ్లింది ఆ పార్టీ వారే. న్యాయస్థానం నుంచి స్పష్టత వస్తే తప్ప… స్పీకర్ స్పందించే అవకాశాలు కనిపించడం లేదు. సాంకేతికంగా అధికార పార్టీకి ఉండాల్సిన అనుకూలతను ఉండనే ఉన్నాయి. ఆ సంగతి ప్రతిపక్ష పార్టీ నేతలందరికీ తెలుసు. ఎన్నికలకు ఇంకొన్ని నెలలే సమయం ఉంది కాబట్టి, ఇప్పుడు ఎలాగూ స్పీకరే స్వయంగా ఫోన్లు చేసి సభకు రమ్మంటున్నారు కాబట్టి, దీన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం వైకాపాకి ఉంది. అంతేకాదు, గడచిన సమావేశాలు హాజరు కాలేదు కాబట్టి… ఈసారి సమావేశాలకు ప్రతిపక్ష నేత జగన్ వస్తున్నారంటే… అది ప్రజలకు కొంత ప్రత్యేకంగా ఆకర్షించే అంశంగా మారుతుంది.
సభలోకి వచ్చాక, మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేసినా, మాట్లాడే అవకాశమే ఇవ్వకపోయినా అప్పుడు మరోసారి అధికార పార్టీ తీరుపై విమర్శలు చేసే అవకాశం దొరుకుతుంది! సభకు హాజరు కాకూడదన్నది పార్టీ నిర్ణయం అనడం కూడా సరైంది కాదు. ఒక పార్టీ తరఫున సభ్యులను అసెంబ్లీకి ప్రజలు పంపించారంటే… దానర్థం వారి సమస్యలపై మాట్లాడమనే. ఆ లెక్కన సభకు హాజరు కాకూడదన్న పార్టీ నిర్ణయం కూడా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నట్టే అవుతుంది.