కామెడీకి కేరాఫ్ అడ్రస్స్ అల్లరి నరేష్. ఇది వరకు నరేష్ సినిమాలు భలే నవ్వించేవి. కితకితలు పెట్టేవి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేవి. నరేష్ కూడా అందుకు తగిన కథలనే ఎంచుకున్నాడు. హిట్లు కొట్టాడు. మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. కాలం మారింది. నరేష్‌కి పోటీ పెరిగింది. ప్రతీ హీరో నవ్వించాలనే చూస్తున్నాడు. దానికి తోడు జబర్దస్త్ లాంటి పోగ్రాంలు ఎక్కువయ్యాయి. నరేష్ కామెడీ రొటీన్ అయిపోయింది. దాంతో ఫ్లాపులు వచ్చాయి. దాదాపు మూడేళ్ల నుంచి హిట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నరేష్. ఇప్పుడు `సిల్లీ ఫెలోస్`తో తనకు మరో అవకాశం వచ్చింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నరేష్‌తో చేసిన చిట్ చాట్.
* ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
– సిల్లీ ఫెలోస్ అనే టైటిల్‌కి తగ్గట్టే సిల్లీగా ఉంటుంది. ఇందులో నా పేరు వీరబాబు. ఓ టైలర్ని. పొలిటీషన్ అవ్వాలని ప్రయత్నిస్తుంటా. నా చుట్టు పక్కల వాళ్లందరినీ వాడేస్తుంటా. అలా నాకు సునీల్ దొరుకుతాడు. నేను చేసే పనులకు అడ్డంగా బుక్కయిపోతుంటాడు.
* సునీల్ మీరూ కలసి నటిస్తున్నారంటే… తొట్టిగ్యాంగ్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఆ స్థాయిలోనే నవ్విస్తారా?
– మా ప్రయత్నం కూడా అదే. `తొట్టి గ్యాంగ్` తరవాత మేమిద్దరం కలసి సినిమా చేయలేదు. ఆ లోటు ఈ సినిమా తీరుస్తుంది. హీరో ఒక్కడే కామెడీ చేస్తే సరిపోదు. పంచ్‌లు రివర్స్‌లో పడుతుంటేనే వినోదం పండుతుంది. సునీల్, బ్రహ్మానందం లాంటివాళ్లు పక్కనుంటే… వినోదం రెట్టింపు అవుతుంటుంది. ఆ అవకాశం ఈ సినిమాతో దక్కింది.
* అటు సునీల్ ఇటు మీరు పరాజయాల్లో ఉన్నారు.. పరిస్థితి విశ్లేషించుకున్నారా?
– మీ నుంచి ఆశించే కామెడీ దక్కడం లేదు అన్నది ప్రధానమైన కంప్లయింట్. అది నేనూ గ్రహించాను. ఈ సినిమా చేసేటప్పుడు నేనూ సునీల్ చర్చించుకున్నాం. ప్రేక్షకులకు ఎలాంటి కామెడీ అయితే నచ్చుతుందో బాగా ఆలోచించి మరీ ఈ సినిమా చేశాం.
* ఇది వరకు తప్పెక్కడ జరిగిందంటారు?
– సుడిగాడు నా సినిమాల్లోకెల్లా అతి పెద్ద విజయం అందుకుంది. ప్రతీ సీనులోనూ నవ్వించాలన్న తపన పెంచింది. ఆఖరికి చావు సన్నివేశాన్నీ కామెడీ చేసే స్థితికి వెళ్లిపోయాను. దాంతో నాపై నేనే అనవసరమైన ఒత్తిడి వేసుకున్నా. ఇదివరకు సినిమాలు తీసుకోండి… అత్తిలి సత్తిబాబు, బెండు అప్పారావు ఆర్.ఎంపీ లాంటి సినిమాలు తీసుకోండి. అందులో కామెడీ ఒక్కటే ఉండదు. అన్నిరకాల భావోద్వేగాలూ ఉంటాయి. నేను మాతద్రం కామెడీపైనే దృష్టి పెడుతున్నా. అందుకే విజయాలు అందడం లేదేమో. ఇక నుంచి కథనీ, కామెడీనీ వేరు వేరుగా చూడాలని నిర్ణయించుకున్నా.
* స్నూఫ్‌ల జోలికి వెళ్లరా?
– అసలు వాటి గురించి ఆలోచించనే కూడదు. ఇది వరకు స్నూఫ్‌లు బాగా పండేవి. మిగిలిన హీరోలు ఏమనుకుంటున్నారు? వాళ్ల ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? అనేవి పట్టించుకోకుండా చేసేవాడ్ని. బాగా పండాయి కూడా. అయితే అవి చేసీ చేసీ నాకే బోర్ కొట్టేసింది. ఇక మీదట వాటి జోలికి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చా. `సుడిగాడు` తరవాత నిజంగానే స్నూఫ్ లు చేయడం లేదు. ప్రతీ కథానాయకుడికీ ఓ శైలి ఉంటుంది. నాక్కూడా ఉంది. ఇక నుంచి నా శైలిలోనే నవ్వించడానికి ప్రయత్నిస్తా.
* `సుడిగాడు 2` చేద్దామనుకున్నారు కదా?
– అవును.. `తమిళ్ పడమ్` చిత్రానికి రీమేక్‌గా `సుడిగాడు` వచ్చింది. ఇప్పుడు తమిళ్ పడమ్కి రీమేక్ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అందుకే తెలుగులోనూ రీమేక్ చేద్దామనుకున్నాం. నేనూ, బీమనేని కలసి `సుడిగాడు 2` తీస్తాం. అయితే అది తమిళ్ పడమ్కి రీమేకా? కాదా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.
* `మహర్షి`లో మీ పాత్ర ఏమిటి?
– మా అబ్బాయి పుట్టిన తరవాత ఒప్పుకున్న మొదటి సినిమా అది. గమ్యంలో గాలి శీను పాత్ర నాకెంత పేరు తీసుకొచ్చిందో, మహర్సిలో నేను చేస్తున్న పాత్ర అంతే పేరు తీసుకొస్తుంది. వంశీపైపడిపల్లి, మహేష్ ఇద్దరూ నేనైతేనే బాగుంటుంది అనుకున్నార్ట. వాళ్ల ప్రతిపాదన నాక్కూడా నచ్చింది. హీరోనా, విలనా, కీలక పాత్రధారా? అనే విషయాలేం పట్టించుకోను. రాజీవ్ కనకాల చేసిన ఓ సినిమాలో నేను విలన్‌గా నటించా. నటుడిగా నాకు గుర్తింపు దక్కితే చాలు.
* సెట్లో మహేష్ ఎలా ఉంటున్నారు?
– చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. సెట్లో మహేష్ ఉంటే సందడిగా ఉంటుంది.
* మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నార్ట..
– అవును. మేమిద్దరం కలసి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నాన్నగారి దర్శకత్వంలో వచ్చిన `ఎవడి గోల వాడిదే` టైపులో సినిమా ఉండాలని మారుతి అన్నారు. అలాంటి కథ తయారు చేస్తున్నారు. గిరి అనే ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. వివరాలు త్వరలో చెబుతా.