“ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం నశించాలి..” ఇదీ సోఫియా అనే విద్యార్థినిని జైల్లో పెట్టించిన నినాదం. ప్రస్తుతం దేశం మొత్తం హాట్ టాపిక్ అవుతున్న వ్యవహారం. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన సోఫియా.. కెనడాలో పీహెచ్డీ చేస్తున్నారు. తూత్తుకుడిలో ఇటీవలి స్టెరిలైట్ పరిశ్రమకు సంబంధించిన ఆందోళనల్లో కాల్పులు జరిగి పెద్ద సంఖ్యలో తూత్తుకుడి ప్రజలు మరణించారు. ఆ ప్రభావం సోఫియాపై బాగా ఉన్నట్లు ఉంది. ఆ ఘటన సమయంలో.. కెనడాలో ఉన్న ఆమె… ఇప్పుడు స్వదేశానికి వచ్చారు. చెన్నై నుంచి తూత్తుకుడికి వెళ్లే ఫ్లైట్లో… బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు తమిళసై కనిపించారు. దాంతో ఆమె ఆవేదన “ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం నశించాలి..” అనే నినాదం రూపంలో వినిపించింది.
దాన్ని తమిళసై సహించలేపోయారు. విమానం దిగగానే ఎయిర్ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడులో ఉన్నది అన్నాడీఎంకే ప్రభుత్వం అయినా… కీ బీజేపీ దగ్గరే ఉంటుంది కాబట్టి.. స్వామి భక్తి ప్రదర్శించారు. సోఫియాపై అత్యంత దారుణమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ నాన్ బెయిలబుల్, రెండు బెయిలబుల్ సెక్షన్లు కింద కేసు పెట్టి అరెస్ట్ చేసేశారు. సుప్రీంకోర్టు గతంలో అనేక కేసుల్లో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సోఫియాను పోలీసులు అరెస్ట్ చేయకూడదు. కానీ న్యాయమూర్తి మాత్రం.. పదిహేను రోజులు రిమాండ్ విధించేశారు. ఈ కేసులో నిందితురాలిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని.. పోలీుసు అధికారులను నిలదీయాల్సిన న్యాయమూర్తే రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడం తమిళనాడులోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు, ఆమె, ఆమె పార్టీ కార్యకర్తలు విమానాశ్రయంలో తమను నానా దుర్భాషలాడారంటూ సోఫియా తండ్రి ఇచ్చిన ఫిర్యాదును మాత్రం తీసుకోలేదు. సోఫియాకు మద్దతుగా తమిళనాడులో అధికారపక్షం మినహా.. అందరూ ఏకమయ్యారు. నేను కూడా.. “ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం నశించాలి..” అని నినాదాలు చేస్తా అరెస్ట్ చేయాలని.. డీఎంకే అధినేత స్టాలిన్ సవాల్ చేశారు. సోఫియాకు మద్దతుగా తమిళనాడు మొత్తం ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కేసు నుంచి సోఫియా ఈజీగానే బయటపడుతుంది కానీ.. బీజేపీలో పెరిగిపోతున్న అసహనానికి మరో సాక్ష్యంగా మిగిలిపోతుంది. నిరసన వ్యక్తం చేయడమే తప్పనట్లుగా.. అభిప్రాయాలు వ్యక్తం చేయడమే నేరమన్నట్లుగా కొద్ది రోజులుగా దేశంలో జరుగుతున్న అరెస్టులు.. ప్రజల్లో ఎమెర్జెన్సీ తరహా భయాన్ని కలిగిస్తున్నాయి.