మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఇప్పుడు ఓ బాంబ్ పేల్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడలేదని.. తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. అంతే కాదు..వైఎస్ అవినీతికి పాల్పడ్డారని కూడా ఓ సర్టిఫికెట్ జారీ చేసేశారు. వైఎస్ మనీ టేకింగ్ చేశారని స్పష్టంగా ప్రకటించారు. కానీ …”మనీ మేకింగ్” చేయలేదని సమర్థించే ప్రయత్నం చేశారు. ఈ రెండింటికి పెద్ద తేడా ఏమిటో ఉండవల్లి స్పష్టంగా చెప్పలేదు కానీ.. రెండింటికి మాత్రం పెద్ద తేడా లేదని ఎవరికైనా అర్థమైపోతుంది. ఎలా చూసినా ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని మాత్రం నేరుగా అంగీకరించినట్లయింది. అది తప్పేం కాదు.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని… లాయర్ తెలివితేటలతో ఎన్ని ఇతర వాదనలు వినిపించినా.. అవేం లెక్కలోకి రావు. ఎందుకంటే.. వైఎస్‌కు ఉండవల్లి అత్యంత సన్నిహిత అనుచరుడు మరి..
రెండు రోజుల కిందట.. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్‌మీట్ పెట్టి.. అమరావతి బాండ్లపై విమర్శలు చేశారు. బాండ్లు ఎవరు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఎక్కువ వడ్డీలు ఇచ్చారని.. మధ్యవర్తికి ఇంకా ఎక్కువ ఇచ్చారని ఆరోపణలు చేశారు. దీనిపై.. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించారు. ఈ బాండ్ల వ్యవహారాల్ని ప్రభుత్వం తరపున ఆయనే చూస్తున్నారు. అవినీతి ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారి వివరాలన్నీ… సెబీ దగ్గర ఉంటాయని.. అందులో రహస్యం ఏముటుందని ప్రశ్నించారు. ఇంటర్నెట్లో అయినా చూసి తెలుసుకోవచ్చన్నారు. అదే సమయంలో… వైఎస్ హయాంలో ఏపీలో జరిగిన అవినీతిని ప్రస్తావించారు. బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. అప్పట్లో టీడీపీ “రాజా ఆఫ్ కరప్షన్” అనే పుస్తకాన్ని ప్రచురించింది. “రాజా ఆఫ్ కరప్షన్” అనే పుస్తకం బహిరంగచర్చకు సిద్ధమని ఉండవల్లి అరుణ్ కుమార్ … కుటుంబరావుకు కౌంటర్ ఇచ్చారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ స్టేట్మెంట్.. టీడీపీ కన్నా… వైసీపీనే ఎక్కువ కంగారు పెడుతోంది. వైఎస్ అవినీతి చేశాడని…చెప్పిన తర్వాత ఎంత సమర్థించుకున్నా..అది ప్రజల్లోకి వెళ్లదు. అదే సమయంలో రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని అందులో ఉన్న అంశాల్ని మరోసారి హాట్ టాపిక్ చేసేలా.. బహిరంగచర్చకు సిద్ధమని… ఉండవల్లి అనడం.. వైసీపీ వర్గాలను.. ఆందోళనకు గురి చేస్తోంది. నాటి అవినీతి వ్యవహారాల అంశాలను మళ్లీ ప్రజల ముందుకు తెచ్చే ఇలాంటి ప్రకటనలు ఉండవల్లి ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. కొన్నాళ్ల క్రితం విభజన చట్టంపై న్యాయపోరాటం చేయాలనుకున్న ప్రభుత్వం..ఆ విషయంలో సలహాల కోసం ఉండవల్లిని సంప్రదించింది. ఉండవల్లి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అప్పటి నుండి జగన్‌తో పాటు ఆయన మీడియా కూడా ఉండవల్లితో కాస్త దూరం పాటిస్తోంది. ఇప్పుడీ ప్రకటనపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి..!