రామ్‌చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజర్ బైజాన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ ఏంటన్నది తెలియలేదు. లుక్కులూ బయటకు రాలేదు. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చరణ్ లుక్ బయటకు రావచ్చని అనుకున్నారు. కానీ `సైరా` ఎఫెక్ట్ వల్ల అది కుదరలేదు. ఆ తరవాత పవన్ కల్యాణ్ పుట్టిన రోజుకి బయటకు తీస్తారని భావించారు. అదీ సాధ్యం కాలేదు. ఓ చిన్న వీడియోతో పవన్‌కి విషెష్ చెప్పేశాడు చరణ్. ఈలోగా షూటింగ్ కోసం ఫారెన్ వెళ్లిపోయింది చిత్రబృందం. మరి చరణ్ లుక్‌ని ఎప్పుడు చూపిస్తారు? మెగా అభిమానుల్లో ఈ ప్రశ్నే మెదులుతోందిప్పుడు. వినాయక చవితి సందర్భంగా ఈనెల 12న గానీ, 13న గానీ చరణ్ లుక్ ఉండొచ్చన్నది లేటెస్ట్ టాక్. బోయపాటికి వినాయక చవితి సెంటిమెంట్ ఎక్కువ. తన సినిమాలేమైనా షూటింగ్లో ఉంటే వాటికి సంబంధించిన విశేషాలన్ని వినాయక చవితినాడు బయటకు వచ్చేలా ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పుడు చరణ్ సినిమా ఫస్ట్ లుక్‌ని వినాయక చవితినాడే చూపించాలని భావిస్తున్నాడట. చరణ్ మాస్ లుక్ ఒకటి డిజైన్ చేసేశాడని, దాన్నే బయటపెట్టబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో కండలు పెరిగిన చరణ్‌ని చూడబోతున్నారు. ఆ కండల్ని తొలి లుక్‌లోనే బయటపెట్టబోతున్నాడని తెలుస్తోంది. సో.. చరణ్ లుక్ కోసం వినాయక చవితి వరకూ ఆగాల్సిందే.