హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సర పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం 118 మందికి పద్మ అవార్డులు లభించనున్నాయి. తెలుగు పత్రికారంగ దిగ్గజం రామోజీరావుకు, సూపర్ స్టార్ రజనీకాంత్, దివంగత పారిశ్రామికవేత్త దీరూభాయ్ అంబానికి పద్మవిభూషణ్ అవార్డ్లు ప్రకటించారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ రవిశంకర్, నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి, సంగీత కళాకారిణి గిరిజాదేవిలకు కూడా ఈ పురస్కారం లభించనుంది. మొత్తం 8 మందికి పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించారు. నటుడు అనుపమ్ ఖర్, బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్లకు పద్మభూషణ్ అవార్డ్లను ప్రకటించారు. క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, సానియా మిర్జాలకు కూడా పద్మభూషణ్ అవార్డులు లభించనున్నాయి. తెలుగు దర్శకుడు రాజమౌళికి, అజయ్ దేవగన్, ప్రియాంక చోప్రా, బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్లకు పద్మశ్రీ అవార్డ్ ప్రకటించారు. రచయిత, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వైద్యుడు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డిలకు కూడా పద్మభూషణ్ అవార్డులు లభించనున్నాయి. మొత్తం మీద చూస్తే పద్మ అవార్డులపై బీజేపీ ముద్ర స్పష్టంగా కనబడుతోంది. తెలుగువారికి పద్మ అవార్డులకు సంబంధించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా చక్రం తిప్పినట్లు స్పష్టమవుతోంది.