ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది మరొకదారని ఓ సామెత ఉంది! భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావుకి ఇది సరిపోయేట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు, ఎన్నికలకు వెళ్తున్నారు, అభ్యర్థుల్నీ ప్రకటించేశారు! ఒక ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా అసెంబ్లీ రద్దు చేసుకునే హక్కు ఆయనకి ఉంటుంది. అయితే, కేసీఆర్ అలా చేశారు కాబట్టి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలకు వెళ్లొచ్చుగా అని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది..? చాలా అసందర్భంగా ఉంటుంది కదా!
విజయవాడలో జీవీఎల్ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని పరోక్షంగా సమర్థించారు. అక్కడితో ఆగితే బాగుండేది.. తెలంగాణలో రాజకీయ పరిస్థితిని పోలుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అధికార పార్టీ తొందరపడుతూ ఉంటే.. ఆంధ్రాలో మాత్రం ఎన్నికలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారన్నారు! ఆ భయంతోనే చంద్రబాబు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనౌతున్నారనీ, ఈ మధ్య అబ్దుల్ కలాం, అలెగ్జాండర్ గురించి మాట్లాడుతున్నది అందుకేనని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో అమరావతిలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనమూ నిర్మించలేదని విమర్శించారు. నిజానికి, రాజధాని నిర్మాణం బాధ్యత ఎవరిదీ… కేంద్రానిది! నిధులు ఇవ్వనిది ఎవరూ… భాజపా సర్కారు. మరి, అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం చెయ్యలేకపోయారంటూ జీవీఎల్ విమర్శించడం ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు!
ఇక, ఎన్నికలంటే భయం అనే విషయానికి వద్దాం! తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలుసు. డిసెంబర్ నాటికి మరోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టేస్తే… వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఆలోచనలు పక్కాగా చేసుకోవచ్చు అనేది ఆయన వ్యూహం. అయినా, అది పూర్తిగా తెలంగాణకు సంబంధించిన విషయం. దీన్ని ఆంధ్రాతో పోల్చుతూ… చంద్రబాబుకి ఎన్నికలంటే భయం అన్నట్టుగా మాట్లాడితే ఎలా..? ఆంధ్రాలో ముందస్తు ఎన్నికల అవసరం కనిపిస్తోందా..? అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్ని కలిపి నిర్వహించడం కోసం కొన్నాళ్లపాటు ముందుగానే ఏపీ అసెంబ్లీ రద్దు చేయాలన్న ప్రతిపాదననే టీడీపీ ఇటీవల తోసిపుచ్చింది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఆమేరకు ఆంధ్రాలో అభివృద్ధి కుంటుపడుతుందనీ, కేంద్రం నుంచి ఏవీ రాకుండా పోతాయన్న కోణంలో ఇటీవలే టీడీపీ చాలా స్పష్టమైన విశ్లేషణ ఇచ్చింది. జీవీఎల్ అనుకుంటున్నట్టు ఆంధ్రాలో ఎన్నికలంటే భయం కాదు… అవసరం ఏముందన్నది పాయింట్.