తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు భీమినేని సినిమాలు అంటే రీమేక్ లే. అది పవర్ స్టార్ట్ అయినా, అల్లరి స్టార్ అయినా. ఇప్పుడు ఈ సిల్లీ ఫెలోస్ కూడా రీమేక్ నే. తమిళంలో హిట్ అయిన ‘వెలైను వాన్ దుట్ట వెల్లైకారన్’ (Velainu Vandhutta Vellaikaaran) సినిమాకు జిరాక్స్ కాపీగా ఇప్పుడు ఈ సిల్లీ ఫెలోస్ సినిమాను థియేటర్లలోకి వదిలారు.
అంతే కాదు..
దర్శకుడు భీమినేని అంటే స్ఫూఫ్ లకు పెట్టింది పేరు.
అల్లరి నరేష్ సినిమాలు అంటే కేరాఫ్ ఇమిటేషన్. పైగా కలర్ ఫుల్ పాటలు, హీరో యేస్సాలు.
ఇక హీరో సునీల్ అంటే కలర్ ఫుల్ డ్రెస్ లు, పాటలు, ఫైట్లు
ఇదీ గత కొన్నేళ్లుగా నడుస్తున్న వ్యవహారం. అయితే ఈసారి ఈ రోటీన్ కు భిన్నంగా ఈ ముగ్గురు కలిసి సిల్లీ ఫెలోస్ సినిమా చేసారు. ఇద్దరు హీరోలను, ఓ డైరక్టర్ ను ఇలా మార్చి, మార్పు అనివార్యం అనిపించిన సిల్లీ ఫెలోస్ సినిమా ఎలా వుందో చూద్దాం.
సిల్లీఫెలోస్ లో పెద్దగా కథ వుండదు. జస్ట్ ఓ రెండు సంఘటనలు, వాటి పర్యవసానంగా పుట్టే ఫన్. అంతే. ఓ మంత్రి చనిపోతూ అయిదు వందల కోట్ల రహస్యం ఎమ్మెల్యే జాకెట్ (జయప్రకాష్ రెడ్డి) కి చెప్పిపోతాడు. కానీ ఆ కొద్ది సేపటికే ప్రమాదం జరిగి ఎమ్మెల్యే కోమాలోకి వెళ్లిపోతాడు. కోమాలోంచి బయటకు వచ్చినా, మెమరీ లాస్ తో పదేళ్ల పిల్లాడైపోతాడు.
ఇదంతా ఓ ట్రాక్.
ఇదే ఎమ్మెల్యే సామూహిక వివాహాలు చేసినపుడు, నెంబర్ కోసం వీరబాబు (సునీల్)కు ఓ వేశ్యతో ఉత్తుత్తి పెళ్లి చేయించేస్తాడు. అది వీరబాబు కొంపమీదకు వస్తుంది. ఎక్కడికి వెళ్లినా, పుష్ప మొగుడు అని పలకరింపు ఎదురవుతుంటుంది.
అదో ట్రాక్.
ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ గా వుండే హీరో (అల్లరి నరేష్) తను ప్రేమించిన అమ్మాయికి పోలీస్ ఉద్యోగం కోసం పదిలక్షలు తీసుకువచ్చి ఎమ్మెల్యే జాకెట్ కు ఇస్తాడు. కానీ అతగాడు కోమాలోకి పోవడంతో, ఆ ప్రియురాలు ఇతగాడిని పట్టుకుని సతాయిస్తూ వుంటుంది.
ఇది ముచ్చటగా మూడో ట్రాక్.
ఈ మూడు ట్రాకులు కలిస్తే సిల్లీ ఫెలోస్ కథ. సిల్లీ ఫెలోస్ కు వున్న కీలకమైన ప్లస్ పాయింట్ ఏమిటంటే, దాని నిడివి. పెద్దగా ఆవులించి, ఎగ్జిట్ గేట్ కేసి చూసే అవసరం రాకుండానే విశ్రాంతి కార్డు పడిపోతుంది. అదే విధంగా మళ్లీ వాచ్ కేసి పదే పదే చూసే అవసరం లేకుండానే సినిమా ముగిసిపోతుంది. పైగా దర్శకుడు శ్రీనివాసరావు మక్కీకి మక్కీ తమిళ సినిమాను ఫాలో..ఫాలో అంటూ వెళ్లిపోయారు. డైలాగులు కూడా అనువాదం చేయించేసారు. అందువల్ల స్క్రీన్ ప్లే కాస్త వేగంగానే చకచకా సాగిపోతుంది. సినిమాకు మరీ పాటల బెడద కూడా లేదు. ఫస్ట్ హాఫ్ ప్రారంభంలో వచ్చే డ్యూయట్, సెకండాఫ్ ప్రారంభంలో వచ్చే పెంచల్ దాస్ ‘హెడ్డేక్’ పాట బాగానే వుంటాయి.
సినిమా తొలిసగం బాగానే వుంటుంది. కామెడీ లవర్స్ చేత ఫరవాలేదు అనిపించుకుంటుంది. కానీ ద్వితీయార్థంలోకి వచ్చేసరికి హీరోలు ఇద్దరూ కామెడీ చేసినట్లు కానీ, చేయించినట్లు కానీ, చేసేందుకు అవకాశం వున్నట్లు కానీ అనిపించదు. దాని దగ్గ సీన్లు పడలేదు. క్లయిమాక్స్ దగ్గరకు వచ్చేసరికి కామెడీ బాధ్యతను జయప్రకాష్ రెడ్డి, పోసాని, రఘు తదితరుల మీద పడేసి, ఇద్దరు హీరోలను అలా వుంచేసారు. అదృష్టం ఏమిటంటే, బి సి ల్లో ఆ క్లయిమాక్స్ కొంతవరకు పడే అవకాశం వుండడం.
అల్లరి నరేష్ చేత స్పూఫ్ లు చేయించకూడదు అని ఒట్టు పెట్టుకున్నట్లే, కామెడీని కూడా తగ్గించేసారు. వాస్తవానికి సినిమా అల్లరి నరేష్ హీరో.కానీ కామెడీ అంతా సునీల్ దే. రెండు పాత్రలను బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎందుకో అంత చాకచక్యం దర్శకుడు భీమినేని ప్రదర్శించలేపోయారు. వుంటే సీన్లో ఇద్దరూ వుండాలి. లేదంటే ఇద్దరూ వుండకూడదు అనే ఫార్ములాను ముందే అనుకున్నట్లు వుంది.
దీనికి తోడు సునీల్ పాపం, సిన్సియర్ గా పక్కా కమెడియన్ గా ట్రయ్ చేసారు కానీ, అతనిలో మునపటి జోష్, ఫన్ మూవ్ మెంట్స్ తక్కువయ్యాయని అనిపిస్తుంది. లేదా అతని నటన రాను రాను రొటీన్ గా మారిపోయి, ప్రేక్షకులకు స్పందన కలిగించలేదు అని అనుకోవాలి.
దీనివల్ల కళ్ల ముందు సినిమా నడచిపోతూ వుంటుంది, కామెడీ కాస్త రన్ అవుతూవుంటుంది. కాసిన్ని నవ్వులు వినిపిస్తూ వుంటాయి. కానీ టోటల్ గా ఓ మాంచి కామెడీ సినిమా చూసిన ఫీలింగ్ అయితే మాత్రం కలుగదు. పైగా దర్శకుడు భీమినేని స్కూల్ అవుట్ డేట్ అయిపోయింది. ఆయన ఈ జనరేషన్ కు తగిన ఫన్ పుట్టించడం ఇక కాస్త కష్టమే అనుకోవాలి. రీమేక్ అంటే జిరాక్స్ కాదని, మన జనాల టేస్ట్, ఈ జనరేషన్ కు తగిన కాస్టింగ్, డైలాగులతో తీయాలని ఆయన తెలుసుకోలేకపోతున్నారు. హీరోయిన్ ట్రాక్ ను బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి, పక్కకు తోసేసారు. నిజానికి ‘పుష్ప ట్రాక్’ తో జనాలను ఊపేసేంత కామెడీ సీన్లు రాసుకోవచ్చు. భీమినేని ఆ ప్రయత్నం అస్సలు చేయలేదు. కేవలం సునీల్ ఎక్స్ ప్రెషన్స్ తొ నవ్వేస్తారు జనాలు అనుకున్నారు.
ఇదే సునీల్ క్యారెక్టర్ ను వెన్నెల కిషోర్ చేత చేయించి వుంటే ఇంకొంచెం బెటర్ మెంట్ వుండి వుండేదేమో అనిపిస్తుంది. అలాగే బ్రహ్మానందం బదులు వేరే యంగ్ కమెడియన్ ను తీసుకుని వుంటే అన్న ఫీల్ కలుగుతుంది. కానీ దర్శకుడు భీమినేని సినిమాలు చేయాలనుకుంటున్నారు కానీ, ఈ జనరేషన్ కు టేస్ట్, ఈ జనరేషన్ కమెడియన్స్ ఎవరు అన్నది గమనించడం లేదు.
ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలే ఇప్పుడు రావడం లేదు. మిడిల్, టాప్ రేంజ్ హీరోలు అందరూ తమ సినిమాల్లో కామెడీ అన్నది ఓ పార్ట్ గా వుండేలా చూసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా అంటే ‘అంతకు మించి’ అన్నట్లు వుండాలి తప్ప, ఏదో తీసాం..చూసాం..అన్నట్లు కాదు. ఈ సంగతి విస్మరించి, మన ప్రయత్నం మనం చేసాం, కాస్సేపు నవ్వించగలిగాం అనే టైపు సినిమా సిల్లీ ఫెలోస్.
ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే అల్లరి నరేష్ కు, సునీల్ కు మరీ బ్యాడ్ మూవీ కాదు. తలకాయనొప్పి, మేధావితనం లాంటి వ్యవహారాలు లేకుండా, జస్ట్ అలా అలా రెండు గంటలు టైమ్ పాస్ అయిపోయే సినిమా అన్న చాయిస్ తీసుకుంటే సిల్లీ ఫెలోస్ కు యావరేజ్ మార్కులు పడిపోతాయి.
మళ్లీ కమెడియన్ గా సునీల్, హీరోయిజం పక్కన పెట్టి అల్లరి నరేష్ తమ నటన ప్రదర్శించారు. కానీ వైవిధ్యం అంటూ ఏమీ లేదు. అలవాటైపోయిన బాడీ లాంగ్వేజ్ లు, డైలాగ్ డెలివరీలే. హీరోయిన్లు ఇద్దరికి అంత స్కోప్ లేదు. పోసాని మామూలే. జయప్రకాష్ రెడ్డి కాస్త ఆకట్టుకుంటాడు క్లయిమాక్స్.
సినిమాకు ఏ మేరకు ఖర్చు చేయాలో ఆ మేరకు ఖర్చు చేసారు. రెండు పాటలు క్యాచీగానే వున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకె. ఓ కామెడీ సినిమాకు సాంకేతిక సహకారం ఏమేరకు వుంటుందో ఆ మేరకు వుంది. ఎక్కువా కాదు, తక్కువా కాదు.
సమ్ థింగ్ డిఫరెంట్, ఏదో అద్భుతం, లేదూ అంటే అంతకు మించి అనే టైపు సినిమాలే ఇప్పుడు జనాదరణకు నోచుకుంటున్నాయి. ఇలాంటి టైమ్ లో సిల్లీ ఫెలోస్ కు బి సి సెంటర్ల ఆడియన్స్ నే దిక్కు.
ఫైనల్ టచ్…కథలేని కామెడీ
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5