అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత టీఆర్ఎస్ … కాంగ్రెస్ పార్టీపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. అదీ కూడా బలమైన మైండ్ గేమ్‌తో ఈ ఆకర్ష్ ను ప్రయోగిస్తున్నారు. 14 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించకుండా… పెండింగ్ పెట్టారు. ఆయా స్థానాల్లో బలమైన కాంగ్రెస్ నేతలకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తోంది. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి సురేష్ రెడ్డి అంగీకరించారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు తాను తెరాసలో చేరుతున్నట్లు సురేశ్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే తెరాస ఆహ్వానాన్ని అంగీకరించానని చెప్పారు. తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ తెరాస అధికారంలోకి రావాలన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. సురేశ్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ అన్నారు.
మరో వైపు వికారాబాద్, మేడ్చల్ నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు ప్రసాద్ కుమార్, కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిలపై కూడా.. ఇలాంటి ప్రచారమే జరిగింది. వారిద్దరూ టీఆర్ఎస్ లో చేరబోతున్నారన్న ప్రచారం ఒక్కసారి ఊపందుకుంది. వారింటికి కేటీఆర్ వెళ్లబోతున్నారని.. వాళ్ల చేరిక లాంఛనమేనని మీడియాకు టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే అనూహ్యంగా వారిద్దరూ టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమకు ఫామ్ హౌస్ కు వెళ్లాల్సిన గతి పట్టలేదని ప్రకటించారు. గాంధీభవన్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. పథకం ప్రకారమే.. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లో చేరబోవడం లేదని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆపరేషన్ ఆకర్ష్ ను భిన్న కోణంలో కొనసాగిస్తోంది. మైండ్ గేమ్ తో వారినిపార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. తమ నేతలు.. టీఆర్ఎస్ ఉచ్చులో చిక్కుకోకుండా.. ఇప్పటికే ఆ పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ మాత్రం.. మైండ్ గేమ్ కాదని… నిజంగానే.. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని.. చెప్పుకొస్తున్నారు. అవసరమైతే టిక్కెట్లలో మార్పులు చేస్తామన్న సూచనలు కూడా టీఆర్ఎస్ అగ్రనేతలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.