ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు మంత్రి ఆది నారాయణ రెడ్డి. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తేనే అసెంబ్లీకి వస్తారని అంటున్నారనీ, కానీ గతం మరచిపోయే జగన్ మాట్లాడటం సరికాదని అన్నారు. వైకాపా పార్టీ పెట్టిన తొలిరోజున తనతోపాటు మేకపాటి రాజమోహన్ రెడ్డితోపాటు ప్రజారాజ్యం, టీడీపీ తరఫున గెలిచినవారంతా 31 మందికి ఆరోజున వేదికపై ఉన్నామన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన మొదటి రోజే ఆరోజు ‘మీ పదవులకు రాజీనామా చెయ్యండి’ అని జగన్ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు? ఆ మధ్య శిల్పా చక్రపాణిని వైకాపాలోకి చేర్చుకుంటూ టీడీపీకి రాజీనామా చేయించి గొప్ప సంస్కృతికి శ్రీకారం చుట్టానని జగన్ అంటున్నారనీ, అదే రోజున టీడీపీ తరఫున గెలిచిన, ప్రస్తుత ఛైర్ పర్సన్ సులోచనని కూడా శిల్పాతోపాటు పార్టీకి రాజీనామా చేయాలని ఎందుకు కోరలేదన్నారు? ఆమెతోపాటు కొంతమంది జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లను టీడీపీకి రాజీనామా చేయకుండానే ఎందుకు చేర్చుకున్నారన్నారు?
తాము కోట్లకు అమ్ముడుపోయామని ఆరోపిస్తున్నారనీ, తమని ఒక దశలో పందులు అని విమర్శించారనీ, ఆయనే ఊరపంది అంటూ విమర్శించారు ఆది నారాయణ రెడ్డి. ఆయన ఎన్ని కోట్లు కాజేశారో ఆయనకే తెలీదనీ, వైకాపాకి తాము దూరం కావడం వెనక సవాలక్ష కారణాలున్నాయన్నారు. పట్టిసీమకు మొదట్నుంచీ అడ్డు తగిలారనీ, రాజధానిని రాష్ట్రం నడిబొడ్డున పెట్టాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తే.. అలాంటి ఆలోచనపై కూడా నెగెటివ్ గా మాట్లాడమని చెప్పేవారన్నారు. ఇలాంటి పరిస్థితి ఉండబట్టే వైకాపా నుంచి తాము బయటకి వచ్చామని సమర్థించుకున్నారు. ఇక, రాజశేఖరెడ్డి గురించి చెప్పాలంటే బండెడు ఉన్నాయనీ, ఎన్నెన్ని దురాగతాలు జరిగాయో మాకు తెలుసు అన్నారు. అసెంబ్లీలో ఎవరైనా వైకాపా ఎమ్మెల్యే రాణింపుగా మాట్లాడితే జగన్ కి అనుమానమనీ, ఆయన పాదయాత్రలో ఉండగా వైకాపా ఎమ్మెల్యేలను సభకు పంపిస్తే, వారు కూడా టీడీపీలోకి వెళ్లిపోతారేమో అని ఆయనకి అనుమానం అన్నారు. చిన్నపిల్లాడిలా నేను సీఎం అవుతా అవుతా అని జగన్ అంటుంటారనీ, ప్రజల తరఫున సభలో మాట్లాడటానికి సభ్యుల్ని పంపించలేని నాయకుడు ఏ విధంగా అవుతారంటూ ఆది నారాయణరెడ్డి విమర్శించారు.
ఫిరాయింపులే కారణంగా చూపుతూ వైకాపా ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తేనే వస్తామని తాజాగా మళ్లీ పట్టుబట్టారు. అయితే, ఈ వాదనను తిప్పి కొట్టడం వరకూ గతంలో తమతో ఎందుకు రాజీనామాలు చేయించలేదు అనే వాదనను బాగానే వినిపించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. కానీ, ఎంత సమర్థించుకున్నా… ఫిరాయింపులు ఫిరాయింపులే! జంప్ జిలానీలు రాజీనామాలు చెయ్యకపోయినా ఫర్వాలేదు… అధికార పార్టీలో కాలం వెళ్లదియ్యొచ్చు అనే ఒక కొత్త రాజకీయ సంస్కృతికి వీరు శ్రీకారం చుట్టారు! గతంలో జగన్ రాజీనామాలు కోరలేదుకాబట్టి, ఇప్పుడు తాము చేసింది కరెక్ట్ అని సమర్థించుకోవడం కూడా సరైంది కాదు కదా.