తెలంగాణ రాష్ట్ర సమితిపై అనుకున్నట్లుగానే కొండా దంపతులు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. టిక్కెట్ విషయం పెండింగ్‌లో పెట్టడం .. తమను అవమాన పరచడమేనని.. పార్టీ కోసం ఎంతో కష్టపడిన తమను పక్కన పెట్టడానికి కారణమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో కొండా సురేఖ పేరు లేదు. అయితే టిక్కెట్‌ను నిరాకరించలేదు. పెండింగ్‌లో పెట్టారు. ఈ విషయంపై తీవ్ర మనస్థాపానికి గురైన వారిద్దరూ… కొండా దంపతులు తిరుగుబాటుకే నిర్ణయించుకున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కేవలం తన కోటరీలోని వాళ్లకు టిక్కెట్లు దక్కేలా చేసుకోవడానికి… తమను పొమ్మనకుండానే పొగ పెట్టారని.. కొండా దంపతులు నేరుగా ఆరోపించారు. చాలా రోజులుగా… మంత్రి కేటీఆర్ తమకు వ్యతిరేకంగా టీఆర్ఎస్లోని ఇతర నేతల్ని పొత్సహిస్తున్నారని.. తమపై అనేక ఆరోపణలు చేయిస్తున్నారని మండి పడ్డారు. తాము రెండు టిక్కెట్లు అడిగామని.. ప్రచారం చేయడం అబద్దమన్నారు.
భూపాలపల్లిలో మధుసూదనాచారిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆయన గెలవరని..అభ్యర్థిని మార్చాలకనుకుంటే.. తమ కుమార్తె పేరును పరిగణనలోకి తీసుకోవాలని మాత్రమే కోరినట్లు కొండా సురేఖ చెప్పారు. ఎంపీగా ఉన్న బాల్కసుమన్గా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నారు. గత ఎన్నికలకు ముందు.. కొండా దంపతుల్ని టీఆర్ఎస్లోకి తీసుకు రావడంలో… హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి.. వీరు.. పార్టీలో ఏ సమస్య వచ్చినా హరీష్ వద్దకే వెళ్తున్నారు. కేసీఆర్ కూడా.,. వీరి విషయంలో ఏ సమస్య వచ్చినా మాట్లాడమని హరీష్‌ని పురమాయిస్తారు. దీంతో వీరు పూర్తిగా హరిష్ వర్గం అన్నట్లుగా ముద్ర పడిపోయారు. ఈ కారణంగానే కేటీఆర్ తమపై కుట్ర చేశారని…నేరుగా ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై కొండా దంపతులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసి గెలిచే సత్తా ఉందన్నారు.
కొండా సురేఖ రాజకీయంగా చాలా బలమైన వ్యూహంతోనే టీఆర్ఎస్ను ఢీకొడుతున్నారు. మహిళలకు నాలుగు టిక్కెట్లు మాత్రమే కేటాయించడాన్ని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన మహిళలకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. బీసీ కార్డు కూడా బయటకు తీశారు. టిక్కెట్లు నిరాకరించిన ఇద్దరూ దళితులు కావడంతో..ఆ విషయాన్నీ వాడారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబజాగీరు కాదన్నారు. చివరికి ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని కూడా ప్రశ్నించారు. చివరిగా.. కేసీఆర్ విశ్వసనీయతను ప్రశ్నించేలా.. వ్యాఖ్యలు చేశారు. ప్రకటించిన 105 మందికి.. బీఫామ్స్ ఇస్తారా అని..అనుమానం వ్యక్తం చేశారు. కొండా సురేఖ వ్యవహారం.. టీఆర్ఎస్లో కలకలం రేపేలా కనిపిస్తోంది.