‘సినిమాల్లో నటించేది లేదు… ప్రస్తుతానికి రాజకీయాలు తప్ప మరో ధ్యాస లేదు’ – పవన్‌కల్యాణ్ స్పష్టంగా చెప్పేశారు. చేతి వరకూ వచ్చిన కథల్ని, మార్పులు–చేర్పులు సూచించిన కథల్ని పక్కన పెట్టేశారు. అయితే… ఆయన మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడానికి సుముఖంగా వున్నార్ట! అదీ మేనల్లుడి కోసం! మెగా బ్రదర్స్‌కి ఇద్దరు సిస్టర్స్! ఇద్దరిలో విజయదుర్గ పెద్ద కుమారుడు సాయిధరమ్ తేజ్ ఎప్పుడో హీరోగా వచ్చారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. పవన్‌కల్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన కిశోర్ పార్ధసాని (డాలి) ఓ కథ సిద్ధం చేశారు. ఆ కథతోనే మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా పరిచయం కానున్నారని తెలుస్తోంది. అలాగే, ఆ సినిమాలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ వుంది. దాన్ని పవన్‌తో చేయించాలని డాలి ప్రయత్నిస్తున్నారు. పవన్ కూడా మేనల్లుడి కోసం సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవితేజ ‘నేల టికెట్’ చిత్రాన్ని నిర్మించిందీయనే. పవన్‌కి సన్నిహితుడు కూడా! ఆ స్నేహం కారణంగానే ‘నేల టికెట్’ ఆడియోకి పవన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇటు మేనల్లుడు పరిచయమవుతోన్న సినిమా… అటు స్నేహితుడే నిర్మాత… దర్శకుడూ తెలిసిన మనిషే… అందరూ కలిసి పవన్‌ని ఒప్పించార్ట!