105 అభ్యర్థుల జాబితాను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించేసిన సంగతి తెలిసిందే. మిగిలిన ఆ కొద్ది సీట్ల విషయంలో కూడా త్వరలోనే స్పష్టత ఇచ్చేస్తారూ, ఎన్నికలకు సంబంధించి అతిపెద్ద ఘట్టం అభ్యర్థుల ఎంపిక అయిపోయినట్టే అన్నట్టుగానే ప్రకటనలు జరిగిపోయాయి. అయితే, ప్రకటించిన ఈ 105 జాబితాలోనూ మార్పులు తప్పవు… నామినేషన్లు వరకూ వచ్చేసరికి వీరిలో ఎంతమందికి బి-ఫామ్స్ ఇస్తారనే అనుమానం కొంతమంది నేతల్లో ఉంది. హుస్నాబాద్ సభలోనే ఆఫ్ ద రికార్డ్ కొంతమంది తెరాస నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఇప్పుడు తెలుస్తోంది. తెరాస కార్యాలయం లాబీల్లో కూడా ఇవే గుసగుసలు వినిపిస్తున్నటు సమాచారం.
ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో కొంతమందిపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనీ, ఆ విషయం ఆయనకి కూడా తెలుసుననే అభిప్రాయం వినిపిస్తోంది. అలాంటప్పుడు ఓటమి అంచున ఉన్నారని తెలిసీ కేసీఆర్ టిక్కెట్లు ఎందుకు ప్రకటించినట్టు..? అంటే, ఇలాంటి సమయంలో ‘ఓటమి అంచున ఉన్నారని కేసీఆర్ అనుకుంటున్న వారిని’ ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి! వారికి టిక్కెట్లు ప్రకటించకుండా ఖాళీగా ఉంచితే… వారంతా ఒక అసమ్మతి వర్గంగా గ్రూపులు కట్టే అవకాశం ఉంటుంది కదా. ఎన్నికల తేదీ ఖరారు కాలేదు కాబట్టి.. ఈలోగా పార్టీలో అదొక సమస్యగా తయారయ్యే అవకాశాలే ఎక్కువ. దాన్ని పెంచి పోషించే కంటే, వారికీ ఇప్పుడు టిక్కెట్లు ఇచ్చేస్తే, వాళ్లంతా ఎవరి నియోజక వర్గాల్లో వాళ్లు పార్టీ పనిలో బిజీబిజీగా ఉంటారు. ఎంపికైన అభ్యర్థులంతా ఇప్పుడు ఎవరి ప్రచారంలో వారున్నారు కదా.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక… నామినేషన్ పత్రాలు ఇచ్చే ముందు చర్చ పెట్టుకోవచ్చేది కేసీఆర్ వ్యూహమని ఆ పార్టీకి చెందిన నేతలే ఆఫ్ ద రికార్డ్ చెబుతున్న పరిస్థితి! కాబట్టి, ఇప్పుడు ప్రకటించిన 105 మందిలో మార్పులు కచ్చితంగా ఉంటాయన్నది తెరాస వర్గాలే నమ్ముతున్నాయి. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులూ ఉన్నాయి. ఉప్పల్ సీటు ఆశించి భంగపడ్డ మేయర్ బొంతు రామ్మోహన్ ను మంత్రి కేటీఆర్ బుజ్జగిస్తున్నట్టు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రకటించేసిన జాబితాలో ఉన్న సుభాష్ రెడ్డికి నచ్చజెప్పి… ఆయనకి బదులుగా ఉప్పల్ నుంచి బొంతు రామ్మోహన్ కి టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతేకాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొంతమంది నేతల్ని కూడా వరుసగా చేర్చుకునే కార్యక్రమం ఇంకోపక్క నడుస్తోంది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించేసిన తరువాత… ఏ పార్టీ నుంచైనా తెరాసలోకి ఎవరైనా ఏం ఆశించి చేరతారు..? కాబట్టి, జాబితాలో మార్పులుంటాయనేదే బలంగా వినిపిస్తున్న మాట.