ఆపరేషన్ గరుడ రూపు మార్చుకుందని… చంద్రబాబును టార్గెట్ చేయడానికి.. కేసుల్లో ఇరికించడానికి కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది.. నటుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలుచేయబోతున్నారని ఆయన విజయవాడలో ప్రకటించారు. సోమవారం చంద్రబాబుకు ఓ రాజ్యాంగ బద్ధ సంస్థ నోటీసులు జారీ చేస్తుందని తనకు విశ్వసనీయమైన సమాచారం ఉందన్నారు. ఇప్పుడు విషయం బయటపడింది కాబట్టి..నాలుగు రోజులు ఆలస్యమైనా నోటీసులు ఇస్తారని శివాజీ చెప్పారు. ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతగా ఇబ్బంది పెట్టిన కేంద్రం మరోకటి లేదని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను ఇబ్బంది పెట్టడమంటే భావితరాలకు నష్టం చేయడమేనన్నారు. చంద్రబాబును పదవి నుంచి దించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలతో కనెక్ట్ అయ్యారు కాబట్టే చంద్రబాబుకు ఇమేజ్ వచ్చిందన్నారు. బీజేపీ నేతలు పొలిటికల్ టెర్రరిస్టులుగా మారారని.. తనకు ప్రాణహాని ఉంది… ఇంతకంటే వివరాలు చెప్పలేను శివాజీ ఆందోళన వ్యక్తం చేశారు.
గత కొద్ది రోజులుగా… కేంద్రం.. చంద్రబాబుపై గురి పెట్టిందని ప్రచారం జరుగుతూనే ఉంది. ఏ క్షణమైనా నోటీసులు రావొచ్చని… బీజేపీ నేతలతో పాటు ఢిల్లీ వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. రాజకీయ ప్రత్యర్థులను సీబీఐతో వేటాడటం పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాధ్రాపై కేసు నమోదు చేశారు. తమిళనాడులో గుట్కా కేసుల్లో మంత్రుల్ని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబుపై గురి పెట్టినట్లు.. శివాజీ లాంటి వారు చెబుతున్నారు.
ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబుపై గురి పెట్టడానికి కొన్ని ప్రత్యేకమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని నమ్ముతున్నారు. ఎదుకంటే..తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు టీడీపీ కీలకంగా మారింది. టీడీపీ కన్నా.. చంద్రబాబు కేసీఆర్ ను ఓడించడానికి ఎక్కువగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. ఉద్యమ నేత కోదండరాంను ముందు పెట్టి మహాకూటమిని పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి.. టీఆర్ఎస్ కోసం.. కేంద్రం చంద్రబాబును బెదిరించేందుకు కేసుల వ్యవహారాన్ని తెరపైకి తెస్తుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో.. వేచి చూడాలి. గతంలో శివాజీ ఆపరేషన్ గరుడ పేరుతో కొన్ని వివరాలు బయటపెట్టారు. అప్పట్లో కూడా ఈ విషయం సంచలనం సృష్టించింది.