‘ఎన్టీఆర్’ సినిమా షూటింగ్ చక చక సాగిపోతోంది. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆ పాత్రలో దగ్గుబాటి రానా కనిపించనున్న సంగతి తెలిసిందే. రానా త్వరలో ఆపరేషన్ నిమిత్తం… విదేశాలకు వెళ్లబోతున్నాడు. ఈలోగా రానాపై సన్నివేశాలన్నీ చక చక తీసేయాలని చిత్రబృందం భావిస్తోంది. మరోవైపు రానా కూడా ఈ షూటింగ్ ముగించే విదేశాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. రానా ఈమధ్య ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రానాకి త్వరలోనే కిడ్నీ మార్పిడి జరగబోతోందని ప్రచారం సాగుతోంది. రానాకి తగిన కిడ్నీ లభించకపోవడంతో.. రానా అమ్మే తన కిడ్నీని రానా కోసం దానం చేస్తున్నారని తెలుస్తోంది. వారం రోజుల్లో ఆపరేషన్ నిమిత్తం రానా విదేశాలకు వెళ్లబోతున్నాడని, ఈలోగా ఎన్టీఆర్ కి సంబంధించిన తన సన్నివేశాల్ని పూర్తి చేసేస్తారని సమాచారం. రానా చేతిలో ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ చిత్రాలున్నాయి. ఇవి రెండూ కేరళలోనే షూటింగ్ జరుపుకోవాల్సివుంది. కేరళలో భారీ వర్షాలు, వరదల వల్ల షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. అందుకే.. ఆపరేషన్‌కి ఇదే సరైన సమయమని రానా భావిస్తున్నాడు.