కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారనే విమర్శలు రాకుండా.. టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేలా.. ఓ మహాకూటమికి ఏర్పాట్లు చేసుకోవాలని టీ టీడీపీ నేతలకు చంద్రబాబు సలహా ఇచ్చారు. కాంగ్రెస్ తో నేరుగా తెలుగుదేశం పొత్తు అంటే ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కాబట్టి.. యునైటెడ్ ఫ్రంట్ మాదిరిగా ఒక కూటమిని ఏర్పాటు చేసి అందులో తెలుగుదేశం చేరితే ఎవరికి పెద్ద అభ్యంతరం ఉండబోదనేది చంద్రబాబు అభిప్రాయం. తెలంగాణ నేతలు కూడా.. ఇదే అభిప్రాయంతో ఉన్నారు. హస్తినలోని కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఈ కూటమికి పచ్చజెండా ఊపారు. కూటమి స్వరూప స్వభావాలు, భాగస్వామ్య పక్షాలు మధ్య సీట్ల సర్ధుబాటు మాత్రమే మిగిలిఉందని ప్రచారం జరుగుతోంది.
కూటమికి సిపిఐ, కోదండరాం, కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరించారు. సిపిఎంను కూడా సంప్రదిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీకి ఇబ్బంది అనే ఉద్దేశంతో బీజేపీ మిత్రపక్షాలను కూడా.. టార్గెట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. నాలుగున్నర సంవత్సరాల టీఆర్ఎస్ పాలన పై వ్యతిరేకత ఉందని, అందువలన కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, కోదండరాం కూటమిగా ఏర్పడి, సీట్ల సర్ధుబాటు పక్కాగా జరిగితే టీఆర్ఎస్ ను దెబ్బకొట్టవచ్చనేది టిడిపి నేతల విశ్లేషణ. సమయానుకూలంగా… అన్ని విషయాల్లోనూ… టీ టీడీపీ నేతలకే నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని చంద్రబాబు ఇచ్చారు.
చంద్రబాబు ప్రచారం విషయంలోనూ టీడీపీ వ్యూహాత్మక ధోరణి అవలంభిస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పుడు విపరీతంగా సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు అది లేదు. చంద్రబాబు ప్రచారం చేస్తే.. దాన్ని బూచిగా చూపి.. టీఆర్ఎస్ సెంటిమెంట్ లేవదీసే ప్రయత్నం చేస్తుందని.. ఆ చాన్స్ టీఆర్ఎస్ కు ఇవ్వకూడదని.. టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే.. చంద్రబాబు ప్రచారం ఉండకపోవచ్చన్న అంచనాలు టీ టీడీపీ నుచి వచ్చాయి. అయితే.. ఎన్నికల సమరం తారస్థాయికి చేరినప్పుడు అవసరమైతే.. కచ్చితంగా చంద్రబాబు ప్రచారం ఉంటుందంటున్నారు. అది రాజకీయ వ్యూహంలో భాగమని చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌తో పొత్తు అనే ప్రస్తావన రాకుండా… మహాకూటమిగా …టీఆర్ఎస్‌పై పోరాటానికి టీడీపీ సిద్ధమైనట్లే..!