తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేశారు. అయితే.. సరైన కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం విపక్షాల విమర్శలనే కారణంగా చూపిస్తున్నారు. విపక్షాల విమర్శల వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని.. అందుకే ఎన్నికలకు వెళ్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు. ఇది ప్రజలను సంతృప్తి పరిచేలా ఉందా..?
ప్రతిపక్షాలు విమర్శిస్తే అసెంబ్లీని రద్దు చేసేస్తారా..?
ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారనుకుందాం. అప్పుడు.. ప్రతిపక్షాలు విమర్శలు చేయకుండా ఉంటాయా..?. గెలిచిన తెల్లవారి నుంచే విమర్శలు ప్రారంభవుతాయి. అంటే.. విమర్శలు చేస్తున్నారే అసెంబ్లీని రద్దు చేస్తే.. డిసెంబర్లో గెలిస్తే.. మళ్లీ జనవరిలో రద్దు చేయాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలన్న తర్వాత విమర్శలు చేయకుండా ఉంటాయా..? కేసీఆర్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే.. బేస్‌లెస్, మైండ్‌లెస్ ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. ఆ రకంగా చేస్తున్నారు కదా అని.. రద్దు చేసుకుంటూ పోతామా..?. ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు… ఏ రాజకీయ పార్టీపైన అయినా… ప్రతిపక్షాలు విమర్శిస్తే.. ఆ విమర్శలు తమపైనే చేస్తున్నట్లు ప్రజలు భావిస్తారు. అలాంటప్పుడు ప్రజలే రెస్పాండ్ అవుతారు. మనం చేసే పని సరైందనప్పుడు… విమర్శలకు భయపడాల్సిన పని లేదు. ప్రతిపక్షాల విమర్శల రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని వాదిస్తున్నారు. విమర్శలకే అభివృద్ధి ఎలా ఆగిపోతుంది..?. ఉదాహరణకు.. అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు హైదరబాద్‌లో ఉన్నాయి. అనేక ఉత్పాదక సంస్థలు ఉన్నాయి. కాంగ్రెస్ విమర్శిస్తుందని.. ఇవన్నీ ఉత్పత్తి ఆపేశాయి. అసలు విమర్శలు లేని ప్రజాస్వామ్య ఎక్కడైనా ఉంటుందా..? డొనాల్డ్ ట్రంప్‌ను కూడా అక్కడి పత్రికలు ప్రతీ రోజూ విమర్శిస్తూనే ఉన్నాయి. అక్కడి అభివృద్ధి ఆగిపోయిందా..?. మన దేశంలో ప్రతిపక్షాలు కామ్‌గా ఉన్నాయా..? రోజూ మోడీని తిడుతూనే ఉన్నాయి కదా..! విమర్శల వాదన అభివృద్ధి ఆగిపోతుందనే వాదన సరైనది కాదు.
ఐదేళ్లు త్యాగం చేయమంటే చేసేస్తారా..?
మేం త్యాగం చేశామని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేశారు. ఎందుకంటే.. తెలంగాణ ఉద్యమం బలంగా ఉందని.. నిరూపించేందుకు… కేసీఆర్ అప్పట్లో రాజీనామా వ్యూహాలు అమలు చేశారు. తెలంగాణ ఉద్యమం లేదు.. కేసీఆర్ ఒక్కడే మాట్లాడుతున్నారని.. కొంత మంది విమర్శలు చేయడంతో.. తెలంగాణ వాదానికి.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉందని నిరూపించేందుకు పదే పదే రాజీనామాలు చేశారు. కానీ ఇప్పుడెందుకు.. రాజీనామాలు చేశారు..?. రేపు కాంగ్రెస్ వాళ్లు… టీఆర్ఎస్కు పదవులంటే ఇష్టం లేదు కదా.. పదవులంటే.. అలా తీసి పడేస్తారు..కదా..! ఓ ఐదేళ్లు పోటీ చేయకండి అని అంటారు. అప్పుడు పోటీ చేయకుండా ఉంటారా..?. అందుకని త్యాగం కూడా అసలు విషయం కాదు. రాజకీయ వ్యూహమే అసలు విషయం. ఇది పైకి చెప్పలేదు. ఎందుకంటే.. టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం కోసం… తమపై ఎన్నికలు రుద్దుతారా అని ప్రజల్లో ఆగ్రహం వస్తుంది.
జమిలికి మద్దతిచ్చి ఇప్పుడెందుకు ముందస్తు..?
ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేస్తే ప్రతిపక్షాలకు ఏంటి సమస్య అని మరో వాదన వినిపిస్తున్నారు. కానీ ఇక్కడ సమస్య అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల సమస్య కాదు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చినప్పుడు.. సరైన రీజన్ లేకుండా.. ఎనిమిది నెలల ముందు… సభను రద్దు చేయడం కరెక్ట్ కాదు. ఎనిమిది నెలలంటే.. ఇరవై శాతం.. సభా సమయం వృధా చేయడమే. దీని వల్ల.. ప్రజలపై భారం పడుతుంది. జమిలీ ఎన్నికలు సమర్థిస్తూ.. టీఆర్ఎస్ చేసిన వాదన ఏమిటి..? వేర్వేరుగా ఎన్నికలు జరిపితే.. ప్రజలపై భారం పడుతుందని.. టీఆర్ఎస్ వాదించింది. జమిలి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసింది. అలాంటి తెలంగాణలో సహజంగా రావాల్సిన జమిలీ ఎన్నికలను.. కాదని.. కారణం లేకుండా ముందస్తుకు వెళ్లారు. ఇదంతా రాజకీయం తప్ప మరో కారణం కాదు.
కేసీఆర్‌కే ఓట్లేయమంటున్నారు.. ఎమ్మెల్యేలకు కాదు..!
శాసనసభ రద్దు చేస్తారని..డిసెంబర్లో ఎన్నికలొస్తాయని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుగా చెప్పారు. 105 మంది సభ్యుల జాబితాను రద్దు చేసిన రోజే ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇది ఊహించని చర్య. ప్రతిపక్షాలు కూడా ఊహించలేని చర్య. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్ ఇస్తానని.. చాలా సార్లు చెప్పారు. కానీ ఎవరూ నమ్మలేదు. అయినా ఇచ్చేశారు. వివాదాస్పద ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు ఇచ్చేశారు. ఇది అందరూ ఆశ్చర్యపోయే విషయం. ఇది రిస్కే. ఎందుకంటే.. కేసీఆర్‌పై వ్యతిరేకత లేదు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. అందుకే.. ఓటు వేయబోయేది తనకు అన్నట్లుగా… చెప్పుకొచ్చారు. అంటే.. ఎన్నికల్ని.. తన పాలనపై రిఫరెండంగా మార్చబోతున్నారు. తన నాయకత్వం కావాలా వద్దా అన్నదానిపైనే ఎన్నికలు జరిగేలా చేయబోతున్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఓటు వేయడం లేదు. తనకు ఓటు వేయమంటున్నారు.
ఊహించని వేగంతో నిర్ణయాలు ప్రతిపక్షాలపై సర్జికల్ స్ట్రైక్సే..!
తన ఊహించని రాజకీయంతో కేసీఆర్ ప్రతిపక్షాలపై ఓ రకంగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు. ప్రచారం కూడా ప్రారంభించారు. ప్రతిపక్షాలు.. పొత్తు, సీట్లు, అభ్యర్థుల్ని ఖరారు చేసుకునేలోపు.. యాభై, అరవై నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేస్తారు. ప్రతిపక్షాలు ఆ వేగాన్ని అందుకోలేవు. కానీ ఇదే విజయాన్ని అందించలేదు. అయితే ప్రతిపక్షాల కన్నా అడ్వాంటేజ్ సాధించారని చెప్పుకోవాలి.