హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక పరిస్థితిని, ప్రపంచంలో ఏమి జరుగుతోందని తెలుసుకోవటానికి దాపోస్ ఆర్థిక సదస్సు ఉపయోగపడిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్, సింగపూర్ పర్యటనలను ముగించుకుని తిరిగి వచ్చిన్ చంద్రబాబు ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నైపుణ్యం, సామర్థ్యం పెంచుకోగలిగితే తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు సాధించొచ్చని అన్నారు. ఇలాంటి సదస్సుల వల్ల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఎలా అందించాలో తెలుసుకోవచ్చని చెప్పారు. స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిక్‌లో 11 కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనట్లు తెలిపారు. ఏపీలో ఫార్మా, సోలార్, పవర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి చూపారని చెప్పారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం బ్రాంచ్ ఏర్పాటుకు ఆహ్వానించానని తెలిపారు.
రాజధాని అమరావతి ప్రాంత రైతాంగంలో అపోహలు పెరిగాయని సీఎమ్ అన్నారు. కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. మాస్టర్ ప్లాన్‌లోని రహదారులపై మంత్రులు తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. రెండు మూడు రోజుల్లో రాజధాని రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. గ్రీన్ బెల్ట్‌పై వస్తున్న అభ్యంతరాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని వేరేచోట పెడితే రైతుల భూముల ధరలు ఇంతలా పెరిగేవా అన్నారు. తమ దావోస్ పర్యటన ప్లెజర్ ట్రిప్ కాదని, ఐఏఎస్ అధికారి రావత్‌కు ప్రమాదం జరిగిందని, ఆపరేషన్ అయిందని చంద్రబాబు చెప్పారు.