ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖలో కొనసాగుతోంది. కంచరపాలెంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… యథావిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేశారు. ఈ పెద్ద మనిషి హుద్ హుద్ ని జయించానంటున్నాడు, దెబ్బ తిన్న ఇళ్లను ఇప్పటికీ కట్టించలేకపోయాంటూ విమర్శించారు. విశాఖలో భాగస్వామ్య సదస్సులు పెట్టి, రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయంటూ అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. ఇక, మిగతా విమర్శలు షరా మామూలే. నిజానికి, హుద్ హుద్ తరువాత విశాఖ ఎంత త్వరగా కోలుకుందో, ఆ దిశగా ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అక్కడి స్థానికులకు తెలుసు. భారీ తుఫాను కారణంగా అస్తవ్యస్థమైన జీవనాన్ని అత్యంత వేగవంతంగా సాధారణ స్థితికి రావడంలో ప్రభుత్వం కృషిని విశాఖ వాసులు ఎవ్వరూ మరచిపోలేరు. ఇక, భాగస్వామ్య సదస్సుల విషయానికొస్తే… పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలతో కుదిరిన ఎమ్.ఒ.యు.ల మొత్తం అది. అవి కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుందనేది అందరికీ తెలిసిన ఒక సాధారణమైన విషయం!
ఈ పెద్ద మనిషి ఎక్కడ కాలు పెడితే అక్కడ ధ్వంసమే అంటూనే మంత్రి వర్గాన్ని గజదొంగల క్యాబినెట్ అని విమర్శించారు. గజదొంగల క్యాబినెట్ లో రైతుల సమస్యలపై చర్చలు ఉండవనీ, శనక్కాయాలకీ బిస్కెట్లకీ భూముల్ని ఎలా ధారాదత్తం చెయ్యాలనే చర్చ మాత్రమే జరుగుతుందని ఎద్దేవా చేశారు. నిజానికి, గజదొంగల క్యాబినెట్ అనేది తీవ్ర విమర్శే. అంటే, క్యాబినెట్ పై కూడా జగన్ కి నమ్మకం లేదన్నమాట! అసెంబ్లీ సమావేశాలకు వైకాపా సభ్యులు హాజరు కావడం మానేశారు. ఫిరాయింపుదారులపై చర్యలు అనే ఒక పాయింట్ ని పట్టుకుని.. ఏకంగా సభను బహిష్కరించేశారు. ప్రజా ప్రతినిధులుగా నిర్వహించాల్సిన కనీస కర్తవ్యాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గాలికి వదిలేశారు. ఇక, ఇప్పుడు క్యాబినెట్ ను గజదొంగల క్యాబినెట్ అంటున్నారు జగన్.
ఇంతకీ, జగన్ కు దేనిపై నమ్మకం ఉన్నట్టు..? అసెంబ్లీపై నమ్మకం ఉంటే… చట్టసభలో ప్రజల తరఫున పోరాడి సాధించుకోగలం అనే విశ్వాసం ఉంటే.. ఇలా బహిష్కరించరు! ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇక, ఇప్పుడు క్యాబినెట్ పై కూడా ఆయనకు నమ్మకం లేనట్టు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ చర్చలకు వేదిక అయితే, మంత్రి మండలి నిర్ణయాలకు వేదిక. సరే, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటే ప్రతిపక్షాలు ఎక్కడ ఎదుర్కోవాలి.. అసెంబ్లీలో! కానీ, జగన్ ఎక్కడ మాట్లాడుతారు… జనంలో! ‘అయ్యా మా తరఫున మాట్లాడండీ’ అంటూ జనాలే వీరిని చట్ట సభలకు పంపిస్తే… తూచ్, మేం సభలకు వెళ్లం, మీ దగ్గరే మాట్లాడతాం అంటే ప్రజలు ఏమనుకుంటారు..? పాదయాత్రలో చేస్తున్న ఆరోపణలూ, విమర్శలూ తిట్లూ శాపనార్థాలూ… ఇవన్నీ అసెంబ్లీ వేదికగా చేస్తే ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. కనీసం ప్రభుత్వం అప్పటికిప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి సభలో ఏర్పడుతుంది. కానీ, ఇలా రోజుకో చోట సభ పెట్టి పాలన బాగులేదూ, అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నిస్తూ పోతుంటే… ఇంతకీ జగన్ కి ఏ తరహా వ్యవస్థపై నమ్మకం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి!