కృష్ణా జిల్లా రాజకీయాల్లో కడప మనుషుల పేరుతో… అక్కడి రాజకీయ నేతలే బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది. ఇలా బెదిరింపులకు దిగింది వేరే ఎవరో అయితే సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదు… కానీ జగన్‌తో వ్యాపార సంబంధాలు ఉండి.. ఇప్పుడు జగన్ పార్టీ తరపునే మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వసంత కుటుంబీకుల నుంచి రావడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మైలవరం నియోజకవర్గం నుంచి .. దేవినేని ఉమామహేశ్వరరావుపై పోటీ చేయడానికి రంగంలోకి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగారు. మొన్నటిదాకా ఈ నియోజకవర్గం వ్యవహారాలను … జోగి రమేష్ అనే నేత చూసుకునేవారు. ఆయన.. దేవినేని ఉమను ఢీకొట్టలేరన్న ఉద్దేశంతో… ఆర్థిక బలం ఉన్న వసంత కృష్ణప్రసాద్‌ను జగన్ రంగంలోకి దింపారు. ఆయన పని ప్రారంభించారు. వైఎస్ వర్థంతి రోజు.. ఏకంగా లక్ష చీరలు పంపిణీ చేసి.. డబ్బుకు వెనుకాడేది లేదని.. చేతలతోనే చెప్పారు. మరో వైపు గ్రామాల్లో పట్టు సాధించేందుకు బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.
వసంత కృష్ణప్రసాద్ తండ్రి, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరారవు .. బెదిరించారని… గుంటుపల్లి గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఆడియోటేపును ఆయన పోలీసులకు సాక్ష్యంగా ఇచ్చారు. ఆ ఆడియో టేపులో బెదిరింపులు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మర్డర్ల ప్రస్తావన కూడా వచ్చింది. దేవినేని ఉమను ఓడించడానికి జగన్ అవసరమైతే కడప నుంచి మనుషుల్ని దించుతాడంటూ.. వసంత నాగేశ్వరరావును హెచ్చరించినట్లు ఆడియో టేపుల్లో ఉంది. దేవినేని ఉమను ఓడించాలనే కసి.. తన కుమారుడు… కృష్ణప్రసాద్‌కే కాదు.. జగన్‌కు కూడా ఎక్కువే ఉందట. తన కుమారుడు తెగించి ఉన్నాడని.. మర్డర్లకు కూడా వెనుకాడడని.. గ్రామకార్యదర్శిని వసంత నాగేశ్వరరావు హెచ్చరించారు. అంతే కాదు.. గ్రామకార్యదర్శి ఎక్కడ నివాసం ఉంటున్నారు.. పిల్లలు ఎక్కడ చదువుతున్నారు లాంటి వివరాల్ని ఆరా తీశారు. దాంతో గ్రామ కార్యదర్శి భయపడిపోయి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైలవరం నియోజకవర్గంలో టీడీపీకి పట్టున్న గ్రామాల్లోకి చొచ్చుకెళ్లేందుకు కృష్ణప్రసాద్ భారీగా సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా విపరీతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడిల్లో ఫ్లెక్సీలు విపరీతంగా వెలిశాయి. ప్రజలకు ఇబ్బందిగా ఉందనేకారణంగా గుంటుపల్లి పంచాయతీ సిబ్బంది రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించారు. టీడీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించారు. కానీ వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు మాత్రం కొడుకు కోసం రంగంలోకి దిగారు. రాజకీయాలకు తనకేం సంబంధం అని.. ఏ పార్టీ ఫ్లెక్సీలు కట్టినా తీసేశానని గ్రామకార్యదర్శి చెప్పినా.. ఆయన బెదిరింపులకే ప్రాధాన్యం ఇచ్చారు. పూర్తిగా ఎన్నికల వేడి పెరగక ముందే.. గతంలో హోంమంత్రిగా పని చేసిన వ్యక్తే.. మర్డర్లు చేస్తాం.. కడప నుంచి మనుషుల్ని దింపుతామని హెచ్చరించడం కృష్ణా జిల్లా వాసుల్ని ఆశ్చర్య పరుస్తోంది. వసంత నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.