ఒకప్పుడు అగ్ర కథానాయకుల సరసన నటించి టాప్ హీరోయిన్ అనిపించుకుంది భూమిక. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెప్పించింది. యోగా గురు భరత్ ఠాకూర్‌ని పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోయింది. అయితే సినిమాల్ని మాత్రం వదల్లేదు. అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఆమధ్య `ఎంసీఏ`లో నాని వదినగా కనిపించిన భూమిక… ఇప్పుడు `యూ టర్న్`లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా భూమికతో చిట్ చాట్.
యూ టర్న్ మీ కెరీర్‌కి మరో మలుపు అనుకోవచ్చా?
పేరులోనే మలుపు ఉంది కదా? అలానే అనుకోవొచ్చు. నిజంగానే చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఇది. నా పాత్ర గత చిత్రాలకంటే భిన్నంగా ంఉటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలు చేయడం నటికి చాలా అవసరం. ఈ సినిమా నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చింది.
ఇది రీమేక్ సినిమా కదా? మార్పులు చేర్పులూ ఏమైనా జరిగాయా?
నేను మాతృక చూశా. నా పాత్ర వరకూ… కొన్ని మార్పులు ఉన్నాయి. మాతృకలో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వకుండా.. దర్శకుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకుని నటించా. కథాపరంగానూ చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అవేంటో తెరపై చూడాలి. తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఈ సినిమాని మలిచారు.
థ్రిల్లర్ జోనర్ అంటే మీకు చాలా ఇష్టమనుకుంటా…
అవును.. ఇలాంటి జోనర్లని బాగా ఆస్వాదిస్తా. హారర్ అంటే మాత్రం ఎందుకో భయం. ఓ నటిగా ప్రతీ సినిమాలోనూ ఎంతో కొంత మార్పు చూపించాలి. ఒకేసారి నూటికి నూరుపాళ్లూ మారిపోవడం సాధ్యం కాకపోవొచ్చు. కనీసం 5 శాతం మార్పు చూపించినా ఎంతో కొంత సాధించినట్టే. యూ టర్న్‌లోని నా పాత్రలో అలాంటి మార్పు చూడొచ్చు.
సమంత నటన ఎలా అనిపించింది?
తను చాలా శక్తిమంతమైన నటి. చాలా తెలివైనది. ఆమె నటించిన ఈగ, రంగ స్థలంచూశా. చాలా బాగా చేసింది. చూడ్డానికి చాలా కామ్‌గా కనిపిస్తుంది. సెట్లో ఫైర్ అయిపోతుంది. తన కళ్లు బాగుంటాయి.
కథానాయికగా మెరిసి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. మీ స్క్రీన్ టైమ్ పట్టించుకుంటారా?
భాగ్ మిల్కా భాగ్ రెండు సీన్లలోనే ఉంటా. కానీ ఆ పాత్రకంటూ ఓ మార్క్ ఉంటుంది. ధోనీలో కూడా అంతే. నేను కనిపించేది 5 నిమిషాలా? లేదంటే సినిమా మొత్తమా? అనేది అనవసరం. ఒక్కోసారి సినిమా అంతా భుజాలపై వేసుకుని నడిపించినా.. ఇంపాక్ట్ అనేది చూపించలేకపోవొచ్చు. 2 నిమిషాలే ఉన్నా.. మన పాత్ర గురించి జనం మాట్లాడుకోవొచ్చు. ఆ పాత్రని దర్శకుడు ఎంత బలంగా రాసుకున్నాడన్నది ప్రధానం.
బాలీవుడ్‌తో పోలిస్తే… దక్షిణాదిన కథానాయికల కోసం సరైన పాత్రలు సృష్టించలేకపోతున్నారా?
ఇది వరకటి సంగతేమో గానీ.. ఇప్పుడు ఆ మార్పు వస్తోంది. కానీ.. ఇది సరిపోదు. ఇంకా మార్పు రావాలి. విద్యాబాలన్ కి 42 రేళ్లు. పెళ్లయిపోయింది. తానేం పర్ఫెక్ట్ ఫిగర్ కాదు. కానీ అద్భుతమైన సినిమాలు చేస్తోంది. అవార్డులు అందుకుంటోంది. ఎలాంటి పాత్రలు రాసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో… మనం మనల్ని ఎంత బాగా కాపాడుకోగలుగుతున్నామన్నదీ అంతే ముఖ్యం. మలైకా అరోరా ని చూడండి. 44 ఏళ్లుంటాయి. కానీ ఇప్పటికీ హాట్‌గా ఉంది. 40 ఏళ్లు దాటిన కథానాయిక కోసం కూడా మంచి పాత్రలు రాస్తుండాలి. అప్పుడే మార్పు కనిపిస్తుంది.
తెలుగులో అలాంటి సినిమాలు రాకపోవడానికి కారణమేంటి?
నిర్మాతలు భయపడుతుంటారు. వాళ్ల డబ్బులు వాళ్లకి రావాలి కదా? అయితే కొంతమంది రిస్క్ తీసుకోవాలి. తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలు ఇష్టపడతారు. కొడితే… గాల్లో ఎగిరిపోవడం… లాంటి సీన్లు బాగా చూస్తారు. మార్పు అనేది మెల్లగా రావాలి. డబ్బులు బాగున్న నిర్మాతలు పెద్ద పెద్ద సినిమాలతో పాటు అప్పుడప్పుడూ చిన్న సినిమాలు తీయాలి. డబ్బులు పోయినా ఫర్వాలేదు.
మీరే నిర్మాతగా మారితే ఇలాంటి సినిమాలు తీస్తారా?
నా డబ్బులైతే పెట్టను. ఎవరైనా ఫైనాన్స్ చేస్తే సినిమా తీస్తాను. నిజం చెప్పాలంటే నా దగ్గర కొన్ని కాన్సెప్టులు ఉన్నాయి. త్వరలో చేస్తానేమో.
ఇప్పుడు ఎలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు?
నాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ నా లెక్కలు నాకున్నాయి. వచ్చినవన్నీ చేయలేను.. ఏది వర్కవుట్ అవుతాయి, ఏవి కావు? అనేది ఆలోచిస్తా. యూ టర్న్ లాంటి సినిమాలు వర్కవుట్ అవుతాయి. ఆ నమ్మకంతోనే ఒప్పుకున్నా. నాకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. వాడ్ని , వాడి స్కూల్‌ని వదిలేసి సినిమాల చుట్టూ తిరడం కష్టమే. కాబట్టి ఆచి తూచి కథల్ని ఎంచుకుంటున్నా.
మీరు కథానాయికగా వెలిగిన రోజుల్లో కమర్షియల్ సినిమాలు బాగా చేశారు కదా?
అవును.. కొన్ని కమర్షియల్ సినిమా చేశా. సింహాద్రి కమర్షియల్ సినిమానే. కానీ నా పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఆ కథని నా పాత్ర నడిపిస్తుంది. క్వీన్ మసాలా సినిమానే. కానీ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. కానీ ఆ కథలో కొన్ని మూమోంట్స్ బాగుంటాయి. అలాంటి పాత్రలు చేయాలి.
పరిశ్రమలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిపోయింది. ఎలాంటి మార్పులు గమనించారు?
20 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. మనుషులు మారాయి. పరిశ్రమ మారింది. సినిమాని, మనుషుల్ని చూసే కోణం మారింది. నేను పూర్తిగా మారిపోయాను. ఈ ప్రయాణంలో కమర్షియల్ సక్సెస్‌లూ, ఫెయిల్యూర్లు నాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. తెలుగులో ఓ సినిమా విడుదల అవుతోందంటే నేను ముంబైలో ఉండేదాన్ని. అక్కడ ఓ సినిమా విడుదల అవుతోంటే నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని. ఈరోజు న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది. జనాలు కూడా సినిమాల గురించి తొందరగా మర్చిపోయేవారు. ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా పెరిగిపోయింది. ఏదో ఓ సినిమా గురించి ప్రతీ రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుకుంటారా?
అస్సలు మాట్లాడను. చిన్నపిల్లలు స్కూల్‌కి వచ్చి… మళ్లీ ఇంటికి వెళ్లినట్టే. మా ఆయన, అమ్మానాన్నలు కూడా సినిమాల గురించి ఏమాత్రం మాడ్లాడరు.