పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా ఏటా రూ.3లక్షల కోట్ల వరకూ ఆదాయం పొందుతున్న కేంద్రం … పన్నుల తగ్గించే విషయంలో నిర్దయగా వ్యవహరిస్తోంది. కొన్ని రాష్ట్రాలు ప్రజావ్యతిరేకతను తగ్గించుకోవడానికి పన్నులను తగ్గిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు రూ. 2 చొప్పున తగ్గించాలని నిర్ణయించింది. మంగళవారం నుంచి ఏపీలో ఈ తగ్గింపు అమలు కానుంది. రెండు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోబోతున్న రాజస్థాన్ ప్రభుత్వం కూడా రూ. 2 మేర ప్రజలకు ఉపశమనం కల్పించింది. కానీ కేంద్రం మాత్రం పన్నుల తగ్గింపు విషయంలో కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు… పెంచిన ఎక్సైజ్ పన్ను కూడా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదు.
పెట్రో ఉత్పత్తులపై వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది తప్పించుకునేందుకు కేంద్రం గత బడ్జెట్ లో అతి తెలివి చూపించింది. లీటర్ కు రూ. 8 రూపాయల టాక్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వెంటనే అదే రూ. 8పై రోడ్ సెస్ విధించింది. అంటే..తగ్గించిందేమీ లేదు. కానీ ఈ సెస్ నుంచి రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన పని లేదు. ఇలా పన్నుల సొమ్ము అంతా కేంద్రం ఖాతాలో ఉండటమే కాకుండా… రాష్ట్రాల పన్నులు తగ్గించుకోవాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనం చేయాలనే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీలో లీటర్‌కు రూ. 2 తగ్గించడం వల్ల ప్రభుత్వానికి రూ.1120 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుంది. పెట్రోధరల తగ్గింపును అసెంబ్లీలో ప్రకటించిన చంద్రబాబు అంతర్జాతీయ పరిస్థితుల వల్లే పెట్రోల్ ధర పెరిగిందని కేంద్రం ప్రజలను మభ్య పెడుతోందని మండి పడ్డారు. 2015-16లో క్రూడాయిల్ ధర కేవలం 46 డాలర్లకు పడిపోయినప్పుడు కూడా..దేశంలో ఇంధన ధరలు తగ్గించలేదని గుర్తు చేశారు. బ్యారెల్ ధర 70 డాలర్లు ఉన్న 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.49.60 ఉందని.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో అంతే ధర ఉన్నా.. దేశంలో రూ.86కి ఉందని.. మండి పడ్డారు.
ఈ సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముసుగువీరుల ఆటలు సాగవని.. మండి పడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐ నోటీసులు ఇచ్చి బెదిరించాలనుకుంటున్నారా? . అధికారం మీకు శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. అధికారంలో రాగానే అవినీతిపరులను జైల్లో పెట్టిస్తానన్న మోడీ… ఇప్పుడు అదే అవినీతిపరులను వెంటేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కేసులను ఒక్కొక్కటిగా సడలిస్తూ సాయం చేస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ, వైసీపీ అక్రమ కలయికను నిరూపిస్తా ..మీరు రాజీనామా చేస్తారా అంటూ విష్ణుకుమార్‌రాజుకు చంద్రబాబు సవాల్ విసిరారు. చంద్రబాబు ఆవేశం చూసి విష్ణుకుమార్ రాజు బిత్తర పోవాల్సి వచ్చింది.జగన్, బీజేపీ మధ్య సంబంధం ఉన్న విషయం తెలియదనేశారు. పన్ను తగ్గింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నాని చెప్పి కూర్చున్నారు.