మన్మథుడు సినిమా గుర్తుంది కదా? అందులో నాగార్జునకు అమ్మాయిలంటే పడదు. వర్క్ పేరుతో హడావుడి చేసేస్తుంటాడు. సరిగ్గా అలాంటి క్యారెక్టరైజేషన్‌తో ఓ సినిమా తయారైంది. అదే.. `నన్ను దోచుకుందువటే`. ఈ సినిమాతో సుధీర్ బాబు నిర్మాతగా మారాడు. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నభా నటేష్ కథానాయిక. ఈరోజు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే మన్మథుడు గుర్తుస్తుంది. కార్తిక్ అనే సిన్సియర్ బాస్ కథ ఇది. తనకో షార్ట్ ఫిల్మ్ పిచ్చి ఉన్న ఓ అల్లరి అమ్మాయి పరిచయం అయితే ఎలా ఉంటుందన్నదే కథ. అమెరికా వెళ్లి, మంచి శాలరీతో అక్కడ స్థిరపడాలనుకున్న అబ్బాయిగా సుధీర్‌బాబు కనిపిస్తాడు. ట్రైలర్ చూస్తుంటే ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. సుధీర్ బాబు ఎంత సిన్సియర్‌గా, సీరియెస్‌గా కనిపిస్తున్నాడో, కథానాయిక నభా నటేష్ అంత అల్లరిగా కనిపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఇందులో కథానాయిక పాత్రే హైలెట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సున్నితమైన కామెడీ, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయినట్టు అనిపిస్తున్నాయి. డైలాగ్స్ సింపుల్‌గా ఉన్నాయి. `సమ్మోహనం`తో క్లాస్ ఆడియన్స్‌కి దగ్గరైన సుధీర్ బాబు.. ఈసినిమాతో ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటాడన్న భరోసా కలుగుతోంది.