కేంద్రం పెట్రోల్ పై పన్నులు భారీగా పెంచలేదట…! గత ప్రభుత్వాలు అంటే.. దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పాలన కంటే.. తక్కువగానే పెంచిందట. ఈ మేరకు మన ఆర్థిక శాస్త్రజ్ఞుడైన ప్రధానమత్రి నరేంద్రమోడీ గారు.. ఓ రెండు ట్వీట్లు చేశారు. అందులో రెండు గ్రాఫిక్ ప్లేట్లు కూడా అమర్చారు. ఒకటి పెట్రోల్ గురించి, మరొకటి డీజిల్ గురించి. అందులో ఏం చెప్పారంటే.. ఎవరు ఎక్కువ పెంచారో మీరే తేల్చుకోండి.. అని ఓ కంపేరిజన్ బోర్డు పెట్టారు. అందులో.. 2004 నుంచి 2018 సెప్టెంబర్ వరకూ ధరలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో పెరుగుతూ పోయిన ధరలు… మోడీ పాలనలో దిగొచ్చినట్లు గ్రాఫిక్స్ రెడీ చేసి పోస్ట్ చేశారు. 70తో పోలిస్తే.. 80 ఎక్కువా..? తక్కవా..? కానీ నరేంద్ర మోడీ తక్కువే అవి ట్వీట్ చేశారు. అదేం విచిత్రమని నెటిజన్లు బుగ్గలు నొక్కుకుని తేరిపార చూస్తే.. అది పర్సంటేజీ అని కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ పెంచిన పర్సంటేజీతో పోలిస్తే మోదీ హయాంలో తక్కువగా పెంచారట..!. అంటే.. పెరుగుదల శాతంతో పోలిస్తే.. పెట్రోల్ రేట్లు తగ్గినట్లేనట.
ఇదేదో.. సాధారణ బీజేపీ కార్యకర్త ఈ లెక్కలు వేస్తే… ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ బీజేపీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లలో దీన్ని పోస్ట్ చేశారు. దీనికి వైరల్ పోస్టు హోదా వెంటనే వచ్చేసింది. బీజేపీ నేతలు కన్నా.. బీజేపీని ట్రోల్ చేసేవారే ఎక్కువ షేర్ చేసుకున్నారు. వెంటనే.. కాంగ్రెస్ హయాంలో బ్యారెల్ ధర ఎంత..ఉండేది..? దేశంలో పెట్రోల్ ధర ఎంత ఉండేది..? లెక్కలు తీసి వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ దోపిడీ అయితే.. మోడీది నిలువు దోపిడీ అని లెక్కలతో సహా పోస్ట్ చేస్తున్నారు. పెట్రో ధరలపై… బీజేపీ ఐటీ విభాగం వేసిన లెక్కలు… చూసి.. అందరూ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి లెక్కలు వేసే.. దేశ ఆర్థిక వృద్ధి రేటు పెరిగిపోతుందని చెబుతున్నారని పంచ్‌లు వేస్తున్నారు.
పెట్రో ధరలపై … బీజేపీ తనను సమర్థించుకోవాలనుకోవడమే పిచ్చి ప్రయత్నం. ఎందుకంటే.. ఈ విషయంపై ప్రజలకు ఇప్పటికే పూర్తి స్థాయి అవగాహన ఉంది. దాన్ని మసి పూసి మారేడుకాయ చేయాలనుకుని.. భంగపాటుకు గురవుతోంది. కాంగ్రెస్ హయాం చివరి ఏడాది.. అంటే 2013-14 ఏడాదిలో… పెట్రో ఉత్పత్తులపై కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయం రూ. 70వేల కోట్లకు అటూ ఇటుగా ఉండేది. ఇప్పుడా మొత్తం రూ. 3లక్షల కోట్ల దరిదాపుల్లో ఉంది. అంటే.. నాలుగేళ్ల కాలంలో దాదాపుగా ప్రజల నుంచి పెట్రో ధరలపై పిండిన పన్నే రూ. 10 లక్షల కోట్ల పైమాటే. అయినా తాము కాంగ్రెస్ కన్నా తక్కువే పెంచామంటూ.. అడ్డగోలు వాదనలతో… సమర్థించుకునేందుకు బీజేపీ ఏమాత్రం వెనుకాడకపోవడం అందర్నీ విస్మయపరుస్తోంది.