మరో మూడు రోజుల్లో ‘రోబో 2.ఓ’ టీజర్ రాబోతోంది. ఈ సినిమా స్థాయి ఏంటన్నది ఆ టీజరే చెప్పబోతోంది. ఇప్పటికే సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. దాంతో.. రోబో 2పై క్రేజ్ కాస్త తగ్గింది. ఒక్కసారి టీజర్ వచ్చేస్తే.. `రోబో` ఫీవర్ మళ్లీ మొదలవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే శంకర్ మ్యాజిక్ అలాంటిది. నాలుగేళ్ల పాటు ఈసినిమాని ఓ యజ్ఞంలా భావించి తీస్తున్నాడు. దాదాపుగా రూ.400 కోట్లు ఖర్చు పెట్టించాడు. తెలుగులో రజనీకి విపరీతమైన మార్కెట్ ఉంది. శంకర్ సినిమా అనగానే అది ఇంకాస్త పెరుగుతుంది. అయితే రజనీ గత చిత్రాలు బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. కబాలి నుంచి కాలా వరకూ… అన్నీ ప్రతికూల ఫలితాల్ని తీసుకొచ్చాయి. ఆ ఎఫెక్ట్ `రోబో 2`పై పడుతుందనుకున్నారు.
అయితే.. పరిస్ధితులు తారుమారు అయ్యాయి. రోబో 2 తెలుగు రైట్స్ కోసం గట్టి పోటీనే ఎదురైంది. దిల్రాజు దాదాపు రూ.60 కోట్ల వరకూ వెళ్లినట్టు సమాచారం. గ్రేట్ ఇండియా వాళ్లు రూ.75 కోట్ల వరకూ బేరమాడారట. ఏసియన్ ఫిల్మ్స్ కూడా రూ.80 కోట్ల వరకూ ఇస్తామని చెప్పిందట. అందుకు సంబంధించి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే… లైకా ఫిల్మ్స్ ఆ అడ్వాన్సుని వెనక్కి ఇచ్చేసి సొంతంగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలుగులో `రోబో 2.ఓ` హిట్టయితే కనీసం రూ.100 కోట్లు వసూలు చేస్తుందని లైకా నమ్ముతోంది. ఆ స్థాయిలో కొనడానికి తెలుగులో ఎవరూ సిద్ధంగా లేరు. అందుకే లైకా సొంతంగానే విడుదల చేయాలని డిసైడ్ అయ్యింది. కాలా విడుదల చేసిన ప్రసాద్ చేతుల మీదుగానే ` రోబో`నీ విడుదల చేస్తున్నారు. సినిమా హిట్టయితే.. రూ.100 కోట్లు సాధించడం పెద్ద కష్టమేం కాదు. అంతకు మించిన వసూళ్లు వస్తాయి. అటూ ఇటూ అయితే మాత్రం..కనీసం రూ.30 కోట్లు కూడా రావు. ఈ విషయం లైకాకీ బాగా తెలుసు. కానీ..ఎందుకనో భారీ రిస్క్ చేస్తోంది. ఇదంతా శంకర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లనేమో. మూడు రోజుల్లో ఎలాగూ `రోబో 2` టీజర్ వస్తోంది కదా?? నిర్మాతల నమ్మకమేంటో ఆ టీజర్ చూస్తే అర్థమైపోతుంది.