తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి వారం రోజులు కాక ముందే.. ఎన్నికల సంఘం ఏర్పాట్లన్ని దాదాపుగా పూర్తి చేసింది. ఈవీఎంలను నియోజకవర్గాలకు పంపించేస్తున్నారు. అంత హడావుడిగా.. శరవేగంగా.., అందరూ ఆశ్చర్యపోయేలా ఈసీ పని చేస్తోంది. అంత వరుకు బాగానే ఉంది కానీ.. ఏపీలో ఐదుగురు వైసీపీ పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదు..?. ఒక్కసారి కూడా.. ఐదుగురు సభ్యుల రాజీనామాలు, వాటి స్థానాల్లో ఉపఎన్నికల విషయంలో ఎందుకు రివ్యూ చేయలేదు. ఏప్రిల్ ఆరో తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. జూన్ ఇరవై ఒకటో తేదీన ఆమోదించారు. రెండున్నర నెలల తర్వాత స్పీకర్ ఎందుకు ఆమోదించారు…?
ఎవరైనా సభ్యులు రాజీనామాలు చేస్తే ఆరు నెలల్లో ఉపఎన్నికలు నిర్వహించి తీరాలి. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కానీ ఎన్నికల సంఘం ఇంత వరకూ.. ఒక్క రివ్యూ కూడా చేయలేదు. ఉపఎన్నికలపై ఎలాంటి కసరత్తు చేయలేదు. కానీ ఈసీ వర్గాలు మాత్రం ప్రజాప్రాతినిధ్యం చట్టం 171Aని కారణంగా చూపిస్తోంది. దీని ప్రకారం.. రాజీనామా చేసిన సభ్యుని పదవి కాలం ఏడాదిలోపు ఉంటే.. ఈసీ దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నిక నిర్వహించకూడదని చెప్పలేదు. కానీ ఎవరో చెప్పినట్లుగా ఉపఎన్నికలు వద్దని.. ఈసీ నిర్ణయించేసుకున్నట్లుగా ఉంది. చట్టసభల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉందంటే.. ఆయా స్థానాల ప్రజలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉండదు.
అందువల్ల ఎన్నికలు నిర్వహించాలనేది రాజ్యాంగంలోని ప్రధానాంశం. దీన్ని రాజకీయ అవసరాల కోసం.. ఈసీ తనకు ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా.. కేంద్రానికి సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీ ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో బందీగా మారిపోయిందని ఈ పరిణామలను బట్టి తెలుస్తోందన్న ఆరోపణలు జోరుగానే వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు నిర్వహించకుండా.. వైసీపీ బీజేపీతో చేసుకున్న ఒప్పందం.. తాజా వ్యవహారంతో బయటపడిపోయిందంటున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమైనా క్లారిటీ ఇస్తుందా..? లేదో చూడాలి..?