ఒక్క బస్సులో ఎంత మంది పడతారు..? వోల్వో బస్సులో అయితే నలభై మంది. మామూలు బస్సులో అయితే కిక్కిరిసి కూర్చున్నా.. బస్సు నిండా నిలబడినా….అంతే మంది పడతారు. కానీ టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో ఏకంగా 101 మందిని కుక్కేసి తీసుకెళ్లారు. అదీ కూడా ఘాట్ రోడ్డు ప్రయాణం. జగిత్యాల జిల్లా… కొండగట్టు దేవాలయం వద్ద జరిగిన బస్సు దర్ఘటనకు ప్రధాన కారణం ఇదే. ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా.. ఆదాయం కోసం.. పరిమితికి రెండింతలు ఎక్కించుకుని టీఆర్ఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయడం వల్లే సమస్య వచ్చింది. బస్సు స్పీడ్ బ్రేకర్ ఎక్కిన సమయంలో.. కంగారు పడిన.. డ్రైవర్ వైపు ప్రయాణికులు ఒంగిపోవడంతో.. బస్సు మొత్తం లోయలోకి జారిపోయింది.
బస్సు ప్రమాదంలో ఏకంగా 50 మంది మరణించడమనే విషయాన్నే ఎవరూ ఊహించలేం. ఎందుకంటే.. బస్సులో అంత మంది ఉండరు కాబట్టి. ఇప్పుడది తెలంగాణలో చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణం అంటూ జగిత్యాల డిపో మేనేజర్ పై వేటు వేశారు. బస్సు డ్రైవర్ కూడా ప్రమాదంలో మృతి చెందారు. గత ఆగస్టు పదిహేనో తేదీనే ఆయన ఉత్తమ డ్రైవర్ గా అవార్డు కూడా అందుకున్నారు. కవిత, కేటీఆర్ హెలికాఫ్టర్ లో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా ఆదేశాలు జారీ చేశారు. దగ్గర్లో మెరుగైన వైద్యసదుపాయాలు లేకపోవడంతో… ప్రాణనష్టం విపరీతంగా పెరిగింది.ఇలాంటి సందర్భాల్లో రాజకీయం ఎందుకనుకున్న విపక్షాలు కూడా.. సంయమనం పాటించాయి. దీనిపై రాజకీయ విమర్శలు చేసుకోలేదు. కానీ ఇదే ఘటన ఏపీలో జరిగి ఉంటే మాత్రం… పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు..!
కొద్ది రోజుల క్రితం… కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ప్రైవేటు బోటు మునిగిపోయింది. పర్యాటకులు మునిగిపోయారు. సహాయకార్యక్రమాలు ఊపందుకోక ముందే వైసీపీ నేతలు వచ్చారు. నీటిలో నుంచి బయటకు తీసిన వారిని ఆస్పత్రికి తరలిస్తూంటే అడ్డు పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి తీరు చూసి అందరూ విస్తుపోవాల్సి వచ్చింది. ఇక కృష్ణా జిల్లాలోనే జరిగిన ఓ బస్సు ప్రమాదంలో.. బస్సు దివాకర్ ట్రావెల్స్ కు చెందినది కావడంతో..నేరుగా జగనే రంగంలోకి దిగా.. కలెక్టర్ చొక్కా పట్టుకున్నంత పని చేశారు. ఏ ప్రమాదం జరిగినా.. ప్రభుత్వ హత్యలే అనడం.. సహాయ కార్యక్రమాలకు సైతం అడ్డం పడటం ఏపీలో కామన్ గా మారింది. క్లిష్ట సమయాల్లో ఏపీలో జరిగే ఇలాంటి రాజకీయ పరిణామాలతో పోలిస్తే.. తెలంగాణ నేతలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని భావించక తప్పదు.