మహా కూటమి పుణ్యమా అని కాంగ్రెస్ కి మహా సమస్య మరొకటి పొంచి ఉందనే చెప్పుకోవచ్చు..! ఆ పార్టీలో ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, ముందస్తు ఎన్నికలు వచ్చేశాయి కదా… చాలా నియోజక వర్గాల్లో ఒక్కో టిక్కెట్టుకీ కనీసం నలుగురేసి చొప్పున పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మహా కూటమి అనేసరికి కాంగ్రెస్ ఆశావహుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటికే బస్సు యాత్రల కోసం, పార్టీ కార్యక్రమాల కోసం చాలా ఖర్చు చేశామనీ, ఇప్పుడు పొత్తులో భాగంగా తమకు టిక్కెట్ లేకుండా చేస్తారేమో అనే ఆవేదన కొంతమందిలో ప్రారంభమైందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు అలాంటి ఆశావహుల తాకిడే ఎక్కువైనట్టు సమాచారం.
కొత్తగూడెం నుంచి కొంతమంది నేతలు గాంధీభవన్ ధర్నాకి దిగారు. డోర్నకల్ నుంచి ఓ ఇద్దరు నేతలు కూడా పొత్తులో భాగంగా తమ స్థానం వేరే పార్టీకి ఇవ్వొదని అభిప్రాయపడ్డారు. వీళ్లే కాదు.. గడచిన రెండు రోజులుగా కొన్ని నియోజక వర్గాలతోపాటు, కొంతమంది కాంగ్రెస్ అభిమానులు కూడా ఉత్తమ్ దగ్గరకి ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలుస్తోంది. నేరుగా ఉత్తమ్ ఇంటికే కొన్ని పంచాయితీలు వెళ్లినట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పొత్తులో భాగంగా తమ స్థానాల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని కొంతమంది బలంగానే చెబుతున్నారట! అయితే, ఇప్పటికే కొంతమందిని పార్టీ అధినాయకత్వం బుజ్జగిస్తోందనీ, పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను వదులుకోక తప్పదనీ, ప్రభుత్వం ఏర్పడ్డాక ఇతర పదవుల కేటాయింపులో ప్రాధాన్యత కల్పిస్తామనే హామీలను కూడా ఇస్తున్నట్టు సమాచారం.
నిజానికి, పొత్తుల కోసం దాదాపు 30 సీట్లను కాంగ్రెస్ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉండేట్టు కనిపిస్తోంది. అదే జరిగితే ఆయా స్థానాల్లో నేతల్ని బుజ్జగించడం తలనొప్పిగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక హామీ ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేసినా… వారితో ఎన్నికల్లో సమర్థవంతంగా పని చేయించుకోవడం, కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయించుకోవడం మరో సమస్య. వాస్తవం మాట్లాడుకుంటే… తెరాసను సమర్థంగా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కి కూటమి బలం అవసరం. ఎందుకంటే, చాలా నియోజక వర్గాల్లో కాంగ్రెస్ కు సరైన అభ్యర్థులేని పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ఒడిసిపట్టాలంటే పొత్తు వినా వేరే మార్గం కూడా కనిపించడం లేదు. కాబట్టి, ఇలా వ్యక్తమౌతున్న అసంతృప్తుల్ని ఏదో ఒకలా సర్ది చెప్పుకోవాల్సిన బాధ్యత ఉత్తమ్ కి తప్పదు.