జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని అంతర్జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. ఒక్క బస్సులో వంద మంది ప్రయాణిస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ప్రమాద వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ఆవేదనను ట్వీట్ రూపంలో వెల్లడించారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కూడా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. 57 మంది మరణించారంటే అతి ఘోర ఉత్పాతం కింద లెక్క. కానీ ఆపద్ధర్మ సీఎం మాత్రం.. ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదు. సీఎం కుమార్తె ఎంపీ కవిత, కుమారుడు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మాత్రం హెలికాఫ్టర్ లో వెళ్లి వచ్చారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు, ఆర్టీసీ తరపున రూ. 3 లక్షలు ప్రకటించారు. కానీ చనిపోయిన వారి ఇళ్లల్లో మాత్రం దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. చనిపోయింది ఎక్కువగా పేదవాళ్లే. గల్ఫ్ లో..ఇతర చోట్లా… వలసపోయిన రక్తసంబంధీకులు వచ్చే వరకూ.. కనీసం… మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ ను కూడా అద్దెకు తీసుకోలేనంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఐస్ గడ్డపై మృతదేహాలను పెట్టి పొట్టుతో కప్పి భద్రపరుచుకున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ఏ అధికారి వారికి సాయం చేయలేదు. విపక్ష నేతలే.. .గ్రామాలు తిరిగి కొంత మొత్తం సాయం చేస్తున్నారు. అఖిలపక్షం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల సాయాన్ని టీ టీడీపీ నేత ఎల్.రమణ అందించారు. ఆర్టీసీ చైర్మన్‌ను బర్తరఫ్ చేసి మృతుల కుంటుబాలకు రూ.50 లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వాస్తుపై ఉన్న శ్రద్ధను ప్రజలపై చూపడం లేదని.. అన్ని పార్టీల నేతలు మండి పడుతున్నారు.
ఒకే ప్రమాదంలో .. అదీ ప్రభుత్వ బస్సు ప్రమాదంలో 5 మంది చనిపోతే. పరామర్శించడానికి వెళ్లకపోవడమేమిటన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజలపై ముఖ్యమంత్రికి ఉన్న బాధ్యత ఇంతేనా అని వైపుల నుంచి వమర్శలు వస్తున్నా… మీడియా మాత్రం. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతే ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వానికి నొప్పి తెలియకుండా.. విధి రాత అన్నట్లుగా వార్తలు రాస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి ఆపద్ధర్మ సీఎం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కొసమెరుపేమిటంటే.. ఓ వైపు ఘోరకలి చోటు చేసుకుంటే..మరో వైపు కేసీఆర్.. పార్టీకి సంబంధిచి కీలకమైన వ్యవహారాలు మాత్రం చురుగ్గా చక్కబెట్టేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన నేతలు నవ్వుతూ.. తుళ్లుతూ..సురేష్ రెడ్డి ని పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు.