పోలవరం “గ్యాలరీ వాక్”ను చంద్రబాబు ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులందరితో సంబరంగా నిర్వహించారు. ఓ పండుగలా జరుపుకున్నారు. దీనిపై సాక్షి పత్రిక.. విభిన్నంగా స్పందించింది. పోలవరం నిర్మాణంలో పూర్తయిన.. ఓ ప్రధానమైన కట్టడం గురించి చెప్పకుండా.. చంద్రబాబు గ్యాలరీ వాక్ చేయడం తప్పన్నట్లుగా స్పందించింది. “పిక్నిక్ వాక్” అని పేరు పెట్టి .. కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేశారని.. సాక్షి పత్రిక రాసేసింది. గ్యాలరీ వాక్‌తో చంద్రబాబుకు, టీడీపీకి వచ్చిన పబ్లిసిటీ చూసి.. జగన్‌కు, వైసీపీ నేతలకు… ఆ పార్టీ మీడియాకు…అగ్రహం రావడం సమంజసమే కానీ.. దాన్ని తక్కువ చేసి చూపించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పడం ఏమిటో.. ఎవరికీ అర్థం కావడం లేదు. చంద్రబాబు అమితంగా పబ్లిసిటీ చేసుకున్నారు. అదేమంత గొప్ప నిర్మాణం కాదని.. చెప్పదల్చుకోవాలనుకుంటే.. ఆ విధంగా చెప్పుకోవచ్చు కానీ… గ్యాలరీవాక్కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. సాక్షి మీడియా ఎందుకు ప్రచారం చేస్తుందో మరి..!
టీడీపీ ప్రభుత్వంపై ఇటీవల వైసీపీ నేతలు.. సాక్షి పత్రిక.. విభిన్న కోణాల్లో విమర్శలు చేస్తున్నారు. అందులో ఒకటి చంద్రబాబు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని చెప్పడం. కొద్ది రోజుల్నుంచి జగన్మోహన్ రెడ్డి ఇవే చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారని.. అవన్నీ దుబారానేనని లెక్క చెప్పారు. అందులో… ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ఖర్చులు కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్యాలరీ వాక్పైనా అదే తరహా ప్రచారం చేస్తున్నారు. గ్యాలరీ వాక్ కోసం.. కోట్లు ఎలా ఖర్చవుతాయో.. సాక్షి పత్రికకే తెలియాలి. ప్రజాప్రతినిధుల్ని.. మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లడానికి ఎనిమిది ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటు చేశారు. పోలవరం వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. అంతకు మించి ప్రభుత్వం తరపున ఏర్పాట్లేమీ లేవు. ఈ ఏర్పాట్లు కూడా.. కొంత కాలం కిందట.. పోలవరం సందర్శించాలనుకునేవారి కోసం… ప్రభుత్వం కొంత మొత్తం విడుదల చేసింది. ఆ నిధుల నుంచే ఏర్పాటు చేశారు. ఇక.. ప్రాజెక్ట్ వద్ద.. గ్యాలరీలో కొన్ని చోట్ల పూలతో అలంకరించారు. అవన్నీ.. కాంట్రాక్ట్ సంస్థ చూసుకుంది. దానికే కోట్ల రూపాయలు ఖర్చు చేసేశారని.. సాక్షి మీడియా ప్రచారం చేసి.. చంద్రబాబు దుబారా చేస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది.
సాక్షి పత్రిక తీరుపై సహజంగానే టీడీపీ నేతలు విమర్శలు చేస్తూంటారు. అయితే సారి విమర్శలు కాకుండా.. వెరైటీ ప్రశ్నలు వేస్తున్నారు. గ్యాలరీ వాక్కే కోట్ల రూపాయలు ఖర్చయితే .. జగన్ తన పాదయాత్రకు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తూ ఉండాలని లాజిక్ తీస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ఆయనతో పాటు కదులుతున్న హంగూఆర్భాటాలను వారు గుర్తు చేస్తున్నారు. ఏసీలతో కూడిన టెంట్లు, జన సమీకరణ, వాహనాలు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది.. ఇలా ఎలా చూసినా.. రోజుకు రూ. వంద కోట్లు ఖర్చవుతాయని లెక్కలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి గ్యాలరీ వాక్ చేసి వస్తేనే కోట్లు ఖర్చయితే.. ఇక పాదయాత్ర పేరుతో జగన్ చేస్తున్న హంగామాకు .. ఎన్ని వందల కోట్లు ఖర్చవుతాయో ఊహించుకోవాల్సిందేనని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు..!